ఈటలది విఫల ప్రయత్నం, వికార ప్రయత్నం : హరీశ్ ఫైర్

టీఆర్‌ఎస్‌లో మంత్రి హరీశ్ రావు కూడా అవమానాలు ఎదుర్కొన్నారన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందించారు. తనపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను హరీశ్ ఖండించారు. ఈటల రాజేందర్ పార్టీని వీడడానికి అనేక కారణాలుండొచ్చని, పార్టీలో ఉండాలా? వెళ్లిపోవాలా? అన్నది ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. ఈటల పార్టీని వీడినా, పార్టీకి కొంచెం కూడా నష్టం వాటిల్లదని, ఆయన పార్టీకి చేసిన సేవ కన్నా, పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ అని పేర్కొన్నారు. ఈటల వ్యక్తిగత సమస్యలకు, ఆయన గొడవలకు పదే పదే తన పేరును ప్రస్తావించడం ఈటల భావదారిద్య్రానికి నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు. తన భుజాలపై తుపాకీ పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నమని, వికార ప్రయత్నమని కూడా హరీశ్ ఆక్షేపించారు.
పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను : హరీశ్
‘‘టీఆర్‌ఎస్‌లో నేను నిబద్ధత, విధేయత, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధి. పార్టీ కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడమే నా విధి. పార్టీ నాయకుడిగా సీఎం కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా, శివరసా వహించడం నా కర్తవ్యం. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, మార్గదర్శి కూడా. నా తండ్రి సమానులు. ఆయన మాట జవదాటను’’ అని హరీశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.