తెలంగాణకు భారీ ప్రాజెక్టులు
తెలంగాణ రాష్ట్రానికి మరో ఎనిమిది భారీ పరిశ్రమలు రానున్నాయి. వీటిలో 5 ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కాగా మూడు ఇతర రంగాలవి. రూ.9600 కోట్ల మేరకు పెట్టుబడులు పెడతామని, దాదాపు 8900 మందికి ఉపాధి కల్పిస్తామని ఈ పరిశ్రమలు ప్రతిపాదించాయి. వీటిలో మూడు పరిశ్రమలు ఉమ్మడి భాగస్వామ్యంతో ఉండగా, అయిదింటిని ఒకే సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తామని వెల్లడించాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎనిమిది పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చేందుకు ఉప సంఘం అనుమంతించింది. ఈ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని తమ ప్రతిపాదనల్లో వెల్లడించగా, దీని కింద అదనపు రాయితీలిచ్చేందుకు అంగీకరించింది. సమావేశ తీర్మానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించాక ప్రాజెక్టుల వారీగా మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న ఆహార శుద్ధి, లాజిస్టిక్ పార్కుల విధానాలను వచ్చే నెల మొదటి వారంలో జరిగే మంత్రిమండలి సమావేశంలో ఆమోదానికి సమర్పించనున్నారు.
ఇటీవలి మంత్రిమండలి సమావేశంలో వీటిని ప్రతిపాదించగా వీటిపై మంత్రులందరి సలహాలను, సూచనలను సేకరించి, వాటిని కూడా చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. దీనికి అనుగుణంగా గత వారం కేటీఆర్ మంత్రులందరితో సమావేశం నిర్వహించి, ఈ రెండు విధానాలపై దృశ్యరూపక ప్రదర్శన ద్వారా వివరించారు. వీటిపై మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించగా ముసాయిదాలో చేర్చారు. మంత్రి మండలి ఆమోదం తెలిపాక వాటిని వచ్చే శాసనసభలో ప్రవేశ పెడతారు.













