ప్రవాస భారతీయుల సేవలతో పేదలకు మేలు
ప్రవాస భారతీయులు పేదలకు మేలు చేసేందుకు ముందుకు రావటం అభినందనీయమని సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ ఏఎస్ నారాయణ అన్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాతా) ఆధ్వర్యంలో వికారాబాద్ మండలం, పూడూరు సాయి మందిరం ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్, మెయినాబాద్ భాస్కర వైద్య కళాశాల వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందించారు. డాక్టర్ నారాయణ మాట్లాడుతూ ప్రతి వారం క్రమం తప్పకుండా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. మతా అసోసియేషన్ సమన్వయకర్త విజయ్ భాస్కర్ మాట్లాడుతూ తాను అమెరికాలో ఉంటున్నా ఇక్కడ ప్రజల ఆరోగ్యం బాగుండాలని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మాతా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్, ఎన్ఆర్ఐలు రమేష్, జగన్, రఘు, వైద్యులు విజయ్ కుమార్, నరేందర్, సిబ్బంది సుచిత్ర, అన్వర్ పాల్గొన్నారు.













