మోడల్ స్కూల్ విద్యార్థులకు అమెరికా ఆహ్వానం
అమెరికాలోని టెక్సాస్‌లో మే 25 నుంచి 28 వరకు నిర్వహించే స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్టు-2023లో పాల్గొనేందుకు తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆహ్వానం అందినట్టు మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ధనుంజయ్ తెలిపారు. అంతరిక్షంలో ఆహార ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఎలా పండించాలి? అక్కడ ప్రజల భద్రత, కృత్రిమ గురుత్వాకర్షణ సృష్టించడం ఎలా? వంటి వాటిపై విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ ఉంటున్నదని వెల్లడించారు. విద్యార్థులు సాదియా బేగం (మహేశ్వరం), లావణ్య ( డీజీ తండా), నందిని (సర్దార్‌నగర్), కళ్యాణ్, పవన్ ( మన్సాన్పల్లి), మహిమలక్ష్మి (నాగిరెడ్డిపల్లి), శివచరణ్ ( తుక్కుగూడ), శ్రీ నవ్య (మహేశ్వరం), లూథియా (తుమ్ములూరు) అమెరికాకు వెళ్తారని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఈ విద్యార్థుల పర్యటనకు ఆర్థిక సహాయం చేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలకు ప్రిస్సిపాల్ విజ్ఞప్తి చేశారు.













