కాంగ్రెస్కు ఓటేస్తే ఎవరికీ న్యాయం జరగదు: కేటీఆర్
తెలంగాణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ఇంటికి పంపాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇంటికి పంపాలని నిలదీశారు. కాంగ్రెస్కు ఓటేస్తే ఎవరికీ న్యాయం జరగదని కేటీఆర్ తేల్చిచెప్పారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. అధికారంలోకి రాకముందే రైతుబంధును కాంగ్రెస్ అడ్డుకుందని గుర్తుచేశారు. పదకొండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందని నిగ్గదీశారు. కాంగ్రెస్ కొత్ద పార్టీ ఏం కాదని, అదో చెత్త పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది కాంగ్రెస్సేనని నిప్పులు చెరిగారు. ‘కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, రూ.2 వేల పెన్షన్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కేసీఆర్ ఏం చేశాడని అడుగుతోంది’ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గొంతు నొక్కేస్తే తెలంగాణ గురించి ఎవరూ ప్రశ్నించరనే ఆలోచనతోనే.. ఢిల్లీ నుంచి అగ్రనాయకులు రాష్ట్రంపై దండెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













