బండి సంజయ్ స్వయంకృతాపరాధం..! కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ పగ్గాలు..!!
అనూహ్య పరిణామాలు, అలకలు, ఫిర్యాదుల అనంతరం తెలంగాణ బీజేపీలో మార్పులకు శ్రీకారం చుట్టింది హైకమాండ్. సుదీర్ఘకాలంగా అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అధ్యక్షుడితో దాదాపు సమానంగా చెప్పుకునే ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ఈటల రాజేందర్ కు కట్టబెట్టారు. ఇన్నాళ్లూ అంతర్గత విభేదాలతో వీధికెక్కిన పంచాయితీ ఇప్పుడైనా సద్దుమణుగుతుందా.. అని అందరూ ఆశిస్తున్నారు. ఎన్నికలకు ఇంకో ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో తీసుకున్న ఈ నిర్ణయాలు బీజేపీకి అధికారాన్ని దగ్గర చేస్తాయా.. అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ బీజేపీ ఒక మెట్టు ఎదిగిందని చెప్పొచ్చు. ఆయన దూకుడు వల్లే బీజేపీ కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి వచ్చింది. హిందూ అజెండాతో పాటు బండి సంజయ్ దుందుడుకు స్వభావం పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా చేయగలిగింది. పైగా అధిష్టానం అండదండలు కూడా ఆయనకు పుష్కలంగా లభించాయి. దీంతో ఆయన బీఆర్ఎస్ పై సై అంటే సై అన్నట్టు పోరాడారు. దీంతో బీజేపీపై నమ్మకం కలిగింది. చాలా మంది నేతలు కమలం కండువా కప్పుకున్నారు. జీహెచ్ఎంసీలో ప్రతిపక్ష స్థానం దక్కించకున్నారు. దుబ్బాక, హూజూరాబాద్ ఉప ఎన్నికలను నెగ్గారు. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి ఫైట్ ఇస్తుందనుకున్నారు. ఆ పార్టీ నేతలు మాత్ర కేసీఆర్ ను ఓడించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామని నమ్మకంతో ఉండేవారు.
కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బీజేపీలో కూడా అదే జరిగింది. పార్టీ తన హయాంలో బాగా బలపడిందనే అహం బండి సంజయ్ కి బాగా పెరిగిపోయిందని ఆ పార్టీ నేతలే చెప్పుకునే పరిస్థితి వచ్చింది. పైగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను కలుపుకుపోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. పార్టీలో తాను చెప్పిందే వేదం అన్నట్టు ఆయన ప్రవర్తించసాగారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది నేతలు ఏకమయ్యారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఒక్కరి వల్ల పార్టీ ఇబ్బంది పడుతుందని భావిస్తే హైకమాండ్ ఊరుకోదు కదా. ఇప్పుడు అదే జరిగింది. ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. కంటితుడుపు చర్యగా బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతోంది.
కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి కొత్తకాదు. చాలా కాలం పాటు గతంలో ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. వివాద రహితుడిగా పేరొందారు. అందరినీ కలుపుకుపోగల నేత. హైకమాండ్ చెప్పింది తు.చ. తప్పకుండా పాటిస్తారు. అందుకే కిషన్ రెడ్డికే మరోసారి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది హైకమాండ్. అయితే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అనుకూల నేతగా ఉంటారనే ఆరోపణలున్నాయి. బండి సంజయ్ లాగా దూకుడుగా వెళ్లే నేత కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి దూకుడు అవసరం. మరి ఎన్నికల ముంగిట కిషన్ రెడ్డి పార్టీని ఎలా లీడ్ చేస్తారో వేచి చూడాలి.













