కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరెవరు?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన మాఘశుద్ధ పౌర్ణమి రోజున మంత్రివర్గ విస్తరణ జరుగనున్నది. ఆరోజు 10 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇప్పటికే గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయమై చర్చించారు. మొత్తం 18 శాఖలకు గాను ఇప్పటికే సీఎం, హోమ్ భర్తీ కాగా మిగతావాటిలో పది శాఖలను ఇప్పుడు భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. మిగతా శాఖలను పార్లమెంట్ ఎన్నికల అనంతరం భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే కెసిఆర్ క్యాబినెట్ లో బెర్త్ దక్కేది ఎవరికి? కొత్త క్యాబినెట్ లో పాత కాపులెంత మంది? కొత్తగా మంత్రులయ్యేది ఎవరు? అన్న విషయమై పార్టీలో చర్చలు మొదలయ్యాయి.
కెసిఆర్ రెండవ క్యాబినెట్ రేసులో ముఖ్యంగా ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సండ్ర వెంకట వీరయ్య, రెడ్యా నాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మహిళల కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి గొంగిడి సునీత, రేఖానాయక్ ల పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ పెద్దల జాబితాలో ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు కూడా ఈ తొలి విస్తరణలోనే అవకాశం దక్కనున్నట్లుగా విస్తత ప్రచారం జరుగుతుంది. మరోవైపు హరీష్‌రావుకు ఈ మంత్రివర్గంలో చోటు కల్పించబోరని, ఆయనను కేంద్రానికి పంపుతారని అంటున్నారు. ఏదీ ఏమైనా కేసీఆర్ మనస్సులో ఏముందో తెలియాలంటే 19 వరకు ఆగాల్సిందే.













