‘ముందస్తు’కు కేసీఆర్ సిద్ధం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడో, రేపో జరగనుంది. ఈ మేరకు అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ఆయన హైదరాబాద్ వచ్చారు. కేబినెట్ భేటీలోని అంశాల అజెండాపై సమాచారంతో సిద్దంగా ఉండాలని సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది కూడా. రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు విభజన, జోనల్ వ్యవస్థ సహా పలు పెండింగ్ అంశాలపైన ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. త్వరలో కొత్త జోనల్ విధానంపై రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీటిపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ జరుగబోయే కేబినెట్ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యం సంతకరించుకుంది.
రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీలు రావడం ఆయనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ విషయంలో కేంద్రం నుంచి గట్టి హామీనే పొందారని తెలుస్తోంది. మరోసారి అసెంబ్లీ భేటీ తర్వాతనే ప్రభుత్వం రద్దు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్2న జరిగే ప్రగతి నివేదిన సభ తర్వాత 6, 7 తేదీల్లో సెంబ్లీ సమావేశం నిర్వహించుకుని 10వ తేదీలోగా అసెంబ్లీని రద్దు చేయ వచ్చునని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత సెప్టెంబర్ 27 తేదీ వరకు ఆరు నెలల గడువు ముగిస్తున్నందున సాంకేతిక ఇబ్బందులు రాకుండా అసెంబ్లీని రద్దు చేసే ముందు తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని సెప్టెంబర్ 2వ తేదీ కంటే ముందే ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశం జరుపుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.













