Kavitha Party : ఏప్రిల్లో కవిత ‘జాగృతి పార్టీ’!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. గత కొంతకాలంగా మౌనంగా ఉంటూనే తన వ్యూహాలకు పదును పెట్టిన మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తన స్వచ్ఛంద సంస్థ ‘తెలంగాణ జాగృతి’ని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ఈ నూతన పార్టీ అధికారికంగా ప్రజల ముందుకు రానుంది.
కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే అన్ని సాంకేతిక, చట్టపరమైన చర్యలను కవిత బృందం పూర్తి చేసింది. గత నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి అవసరమైన అన్ని పత్రాలతో కూడిన దరఖాస్తును అందజేశారు. ఈసీఐ నిబంధనల ప్రకారం పార్టీ పేరు నమోదు, ఇతర వివరాల పరిశీలనకు సాధారణంగా రెండు నెలల సమయం పడుతుంది. అన్నీ సవ్యంగా సాగితే, ఉగాది పర్వదినం తర్వాత, ఏప్రిల్ ఆఖరి వారంలో ఒక మంచి ముహూర్తాన్ని చూసుకుని కవిత తన పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించనున్నారు.
భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత కవిత తన రాజకీయ పంథాను పూర్తిగా మార్చుకున్నారు. కేవలం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని తెలుసుకునేందుకు జాగృతి జనంబాట పేరుతో పర్యటనలు చేపట్టారు. కేవలం భావోద్వేగాల మీద కాకుండా, ప్రజా సమస్యల ప్రాతిపదికన పార్టీ విధానాలు ఉండాలని ఆమె భావిస్తున్నారు. వివిధ సామాజిక వర్గాల సమస్యలు, ఆర్థిక స్థితిగతులు, రైతాంగ ఇబ్బందులపై అధ్యయనం చేయడానికి 50 కమిటీలను ఏర్పాటు చేశారు. మేధావులు, విద్యార్థులు, కుల వృత్తుల వారితో సమావేశమై పార్టీ ఎజెండా రూపకల్పనలో వారి భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారు, అమరవీరుల కుటుంబాలు ‘జాగృతి’ నీడలోకి రావాలని ఆమె బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ కొత్త పార్టీ రూపకల్పన వెనుక ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీం పని చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా మేనేజ్మెంట్ నుండి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ నిర్మాణ వరకు పీకే సలహాలను కవిత తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, రాబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలే ఈ పార్టీకి మొదటి పరీక్ష కానున్నాయి. ఒకవేళ ఈసీఐ నుంచి గుర్తింపు సకాలంలో వస్తే, హైదరాబాద్ నగర వ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టి తన సత్తా చాటాలని కవిత యోచిస్తున్నారు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన రాజకీయ శక్తిగా ఎదగాలన్నది ఆమె మాస్టర్ ప్లాన్.
“నా రాజకీయ భవిష్యత్తు కోసం పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకున్నాను. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు ఈ పార్టీ నాంది పలుకుతుంది” అని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘సామాజిక తెలంగాణ’ నినాదంతో, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ ఎజెండా ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ప్రకటించనున్నారు. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ‘జాగృతి’ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.













