ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు కొనసాగించాలి: జేడీ లక్ష్మీనారాయణ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి రాజధానిగా ప్రస్తుతం హైదరాబాద్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం ఈ గడువు జూన్ 2వ తేదీన ముగియబోతోంది. ఇలాంటి సమయంలో భాగ్యనగరాన్ని మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా జై భారత్ పార్టీ చీఫ్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. విభజన చట్టం ప్రకారం జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటివరకు రాజధాని ఏర్పాటు చేసుకోలేకపోయిందని, అందువల్ల హైదరాబాద్‌ను మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతిని కూడా ట్యాగ్ చేశారు.