సెప్టెంబర్‍లో హుజురాబాద్ ఉప ఎన్నిక ?

సెప్టెంబర్‍లో హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలకు సంకేతాలు అందినట్లు సమాచారం. కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్‍లోగా 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారుల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల సిబ్బందికి ముందే వ్యాక్సినేషన్ ఇస్తారని అంటున్నారు. ఓటర్లు, నేతలకు విసృతంగా వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. గత సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో హుజురాబాద్‍లో ఎన్నికలు అనివార్యం కావడంతో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి నెలకొంది. ఈ మేరకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే దృష్టి సారించాయి.
ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‍పై నిప్పులు చెరుగుతూ బీజేపీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అటు టీఆర్‍ఎస్ కూడా నియోజకర్గంలో అధిపత్యం చాటేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్‍తో పాటు టీఆర్‍ఎస్ నేతలు అందరూ హుజురాబాద్ టీఆర్‍ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్‍ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.