బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావు…
తెలంగాణ వార్షిక బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం ప్రవేశపెట్టారు. హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం గంట 7 నిమిషాల పాటు కొనసాగింది. 2,30,825.96 కోట్ల రూపాయలుగా రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్ లో 47,911.54 కోట్ల మేర ప్రతిపాదనలు పెరిగాయి. ఇక రెవిన్యూ వ్యయం 1,69,383.44 కోట్ల రూపాయలు కాగా, ఆర్థిక లోటు అంచనా 45,509.60 కోట్లుగా ఉంది. ఇక పెట్టుబడి వ్యయం 29.046.77 కోట్ల రూపాయలు కాగా, రెవిన్యూ మిగులు 6,743.50 కోట్లుగా ఉంది. ‘‘ఏడేళ్లలో తెలంగాణ మిగతా రాష్ట్రాలను ప్రగతి పథంలో అధిగమించింది. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నాం.’’ అని హరీశ్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఓ పాట పాడారు హరీశ్. ‘‘చూడు చూడు నల్లగొండ… గుండె మీద ఫ్లోరైడ్ బండ… బొక్కలొంకరు బోయిన బతుకులా… మన నల్లగొండ… దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు’’అంటూ తాగునీటి కష్టాలను చూసి స్వయంగా కేసీఆర్ రాసిన పాట అని మంత్రి తెలిపారు. ఈనాడు నల్లగొండ నుంచి ఫ్లోరైడ్ను శాశ్వతంగా దూరం చేశామని తెలిపారు. మిషన్ భగీరథ పథకం నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలకు చరమగీతం పాడిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేళ్లలోనే తాగునీటి కష్టాలను తీర్చారని పేర్కొన్నారు. అత్యంత పట్టుదలతో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసిందని, అందరికీ సురక్షిత జలాలు, ఇంటింటికి నల్లాల ద్వారా అందుతున్నాయని హరీశ్ పేర్కొన్నారు.
బడ్జెట్లోని ముఖ్యాంశాలు
రాష్ట్ర బడ్జెట్ – 2,30,825.96 కోట్లు
రెవిన్యూ వ్యయం – 1,69,383.44 కోట్లు
ఆర్థిక లోటు అంచనా- 45,509.60 కోట్లు
పెట్టుబడి వ్యయం – 29.046.77 కోట్లు
రెవిన్యూ మిగులు – 6,743.50 కోట్లు
సీఎం దళిత్ ఎంపవర్మెంట్ – వెయ్యి కోట్లు
హోంశాఖ- 6,465 కోట్లు
వ్యవసాయం – 25 వేల కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ-1500 కోట్లు
పశుసంవర్ధక శాఖ – 1,730 కోట్లు
రైతుబంధు- 14,800 కోట్లు
రుణమాఫీ – 5,225 కోట్లు
సమగ్ర భూసర్వే – 400 కోట్లు
పంచాయతీ, గ్రామీణాభివృద్ధి 29, 271 కోట్లు
నీటిపారుదల – 16,931 కోట్లు
ఆసరా పింఛన్లు -11,728 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ – 2,750 కోట్లు
నేతన్నల కోసం -338 కోట్లు
ఎస్సీల ప్రగతి కోసం -12,304 కోట్లు
ఎస్టీల ప్రగతి కోసం -12,304 కోట్లు
బీసీ సంక్షేమ శాఖ- 5,522 కోట్లు
మూసీ అభివృద్ధికి – 200 కోట్లు
మెట్రో రైలు- 1000 కోట్లు
ఆర్టీసీకి – 1500 కోట్లు
అటవీ శాఖకు 1,276 కోట్లు
నూతన సచివాలయ నిర్మానానికి- 610 కోట్లు
ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధికి 800 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం- 11 వేల కోట్లు
ఐటీ రంగానికి – 360 కోట్లు
సాంస్కృతిక పర్యాటక రంగాలు – 726 కోట్లు
పాఠశాల విద్య- 11,735 కోట్లు
ఉన్నత విద్యారంగం- 1,873 కోట్లు
షీ టాయిలెట్లకు – 10 కోట్లు
స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణం కోసం – 3 వేల కోట్లు
మహిళా శిశు సంక్షేమం – 1,702 కోట్లు
1000 కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్
ఈ బడ్జెట్లో షెడ్యూల్ కులాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎస్టీల కోసం ప్రత్యేకంగా ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలను కల్పించబోతున్నామని ఆర్థిక మంత్రి హరీశ్ ప్రకటించారు.













