టీఆర్ఎస్ కు భారీ షాక్…కారు దిగిన గట్టు రామచందర్ రావు
టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత గట్టు రామచందర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యానని లేఖలో గట్టు తెలిపారు. మీరు ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గట్టు రాజీనామాతో ఖమ్మం జిల్లాల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది.













