కొవిడ్ ఆస్పత్రిగా గాంధీ… ప్రతి 10 నిమిషాలకు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి మరోసారి పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా మారనుంది. రేపటి నుంచి (17వ తేదీ నుంచి) పూర్తి స్థాయిలో గాంధీలో కొవిడ్ సేవలు అందించనున్నారు. ఈ మేరకు కొవిడ్ ఆస్పత్రిగా గాంధీని మార్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా రేపటి నుంచి ఓపీ సేవలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ను కూడా ఆపేసి కేవలం కరోనా కేసులకు మాత్రమే చికిత్స అందించనుంది. గాంధీలో ఇప్పటికే 450 మందికి పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 150 మంది ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఐపీ బ్లాక్ మొత్తం ఇప్పటికే కొవిడ్ పేషెంట్స్తో నిండిపోయిందని, ప్రతి 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ గాంధీలో చేరుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా రోగులు పెరుగుతుండటంతో నాన్ కోవిడ్ డిపార్ట్ మెంట్ ను వైద్యులు ఖాళీ చేయిస్తున్నారు.