తెలంగాణలో త్వరలో ఫాక్స్‌కాన్ యూనిట్ : యాంగ్ లియూ
తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఫాక్స్‌కాన్ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ యాంగ్ లియూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనకు, తన బృందానికి మంచి అతిథ్యం ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ ఆలోచనలు, ప్రణాళికలు తనలో స్ఫూర్తి నింపాయన్న యాంగ్ లియూ.. భారతదేశంలో తనకు కొత్త స్నేహితుడు లభించాడని, భవిష్యత్‌లో తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీన సమావేశంలో చెప్పినట్లుగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు ఫాక్స్ కాన్ కట్టుబడి ఉందని లేఖలో స్పష్టం చేశారు. కొంగరకలాన్ పార్కులో కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేలా తమ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని కోరారు. తైవాన్ లో పర్యటించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యాంగ్ లియూ ఆహ్వానించారు. తైపీలో అతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో గౌరవంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.













