హరీశ్ రావు కూడా అవమానాలు ఎదుర్కొన్నారు : ఈటల ఆరోపణలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకూ, సీఎం కేసీఆర్‌కు ఉన్న గ్యాప్ ఈనాటిది కాదని, గత 5 సంవత్సరాలుగా ఈ గ్యాప్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో తనతో పాటు మంత్రి హరీశ్ రావు కూడా ఎన్నో అనుమానాలు ఎదుర్కొన్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాన్ని తాను, హరీశ్ రావు పెట్టిస్తే, దాన్ని ఇప్పుడు సీఎం కేసీఆర్ కూతురు కవిత నడుపుతున్నారని, ఆర్టీసీ కార్మిక సంఘం విషయంలో కూడా ఇదే జరుగుతోందని దుయ్యబట్టారు. ఏ సంఘానికీ ఈ రోజు హక్కులు లేవని, ధర్నా చౌక కూడా లేదని మండిపడ్డారు. ఆర్థిక మంత్రిగా టీఎన్జీవోలు తనను కలిస్తే, అవహేళన చేశారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోలేరని స్పష్టం చేశారు. హరీశ్ రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవకాశం ఇవ్వలేదని వెల్లడించారు. కేసీఆర్‌ను కలవడానికి ఎమ్మెల్యేలు అందరమూ కలిసి వెళితే, గేటు దగ్గరే నిలిపేశారని, రెండోసారి ప్రయత్నిస్తే కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి వారిని తనలాగే బయటికి గెంటేశారని, మంత్రులకు, అధికారులకు ఏమాత్రం స్వేచ్ఛలేదని ఆరోపించారు. తెలంగాణ రాగానే నక్సలైట్ అజెండాను అమలు చేస్తానని చెప్పారని, అలాంటిది విరసం నేత వరవర రావును అరెస్ట్ చేస్తే సీఎం ఎందుకు మాట్లాడలేదని ఈటల ప్రశ్నించారు.
తెలంగాణ సమాజంలో తాను సంపాదించుకున్న పేరును దెబ్బతీసేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలు డబ్బు సంచులను, కుట్రలను, కుతంత్రాలను బొందపెడతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు తాను దూరం కానని, నియోజకవర్గ ప్రజలతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు.