బీజేపీలో చేరగానే ఈటల ఏమన్నారంటే….

తనపై ఉంచిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణలో బీజేపీ విస్తరణకు కృషి చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. పార్టీ విస్తరణ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని, అలాగే పనితనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో పాగా వేయాలని అధిష్ఠానం ఉవ్విళూరుతోందని, అందుకు తగ్గట్టుగానే తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తామని ఈటల హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్ ఛుగ్ ఆయన్ను సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఇచ్చారు. తదనంతరం పుష్పగుచ్ఛం, పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… రాబోయే కాలంలో మరింత మంది బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారని, వారందరూ మెళ్లి మెళ్లిగా పార్టీలో చేరతారని ఈటల ప్రకటించారు. తమపై విశ్వాసం ఉంచినందుకు బీజేపీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈటల ప్రకటించారు.