విజయోత్సవాలపై నిషేధం విధించిన ఎస్ఈసీ

రాష్ట్రంలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 3 వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించింది. కోవిడ్ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. గెలుపొందిన తర్వాత అభ్యర్థి ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతినిస్తామని స్పష్టం చేసింది. విజేతతో పాటు మరో ఇద్దరు మాత్రమే పత్రం అందుకునేందుకు రావాలని పేర్కొంది. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. మే 3న వీటి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం పై సూచనలు చేసింది.