పాదయాత్రకు వస్తున్న స్పందన చూడలేక.. మాపై దాడులు
పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక టీఆర్ఎస్ దాడులు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రలో (జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల వద్ద) స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాసంగ్రామ యాత్ర సాగుతోందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆమె ఆరోపించారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. బీజేపీ నేతలపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడులు చేస్తున్నారన్నారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ శ్రేణుల దాడిలో తమ ఐదు వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటని నిలదీశారు. పాదయాత్రలో పేదలు తమ కష్టాలు, బాధలు ఏకరవు పెడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు తమ శ్రేణులకు మద్య తాగించి మాపై ఊసిగొల్పుతున్నారని ఆరోపించారు. సంయమనం పాటించాలని తమ కార్యకర్తలను కోరుతున్నట్లు తెలిపారు.













