డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ముఖ్యమంత్రి విచక్షణాధికారాలతో ఎవరినైనా గ్రూప్-1 స్థాయి దాకా ఉన్న పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది. ఆ అధికారంతోనే సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించనున్నారు. సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సూర్యాపేట వెళ్లనున్నారు. ఈ సందర్భంగానే సంతోషికి నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేయనున్నారు. అలాగే, హైదరాబాద్ జిల్లా షేక్‌పేటలో 500 గజాల స్థలం కేటాయింపు జీవో కాపీతోపాటు రూ.5 కోట్లు చెక్కును అందించనున్నారు.













