ఐఐటి రూర్కీకి 45 మంది తెలంగాణ విద్యార్థుల బృందం
– యువ సంగం ఫేజ్-2 కింద ప్రతినిధి బృందం పర్యటన
– ఉత్తరాఖండ్ చరిత్ర, సంస్కృతి, జీవన శైలిపై అధ్యయనం
దేశంలోని వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలపై యువత అవగాహన పెంచుకొని, విభిన్న రంగాల ప్రముఖులతో సమావేశమై పరస్పరం తమ ఆలోచనలను పంచుకొనేందుకు ఉద్ధేశించిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యువసంగం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుంచి 45 మందితో కూడిన విద్యార్థుల ప్రతినిధుల బృందం ఐఐటి రూర్కీకి బయలుదేరింది.
యువ సంగం ఫేజ్-2 కింద ఈ కార్యక్రమానికి ఎన్ఐటి వరంగల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని ఐసిఎఫ్ఎఐ బిజినెస్ స్కూల్, విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సహా తెలంగాణలోని ఇతర ప్రముఖ హెచ్ఇఐల నుండి 45 మంది విద్యార్థుల బృందం ఐఐటి రూర్కీకి బయలుదేరింది.
ఈ యాత్రకు NIT వరంగల్ నోడల్ ఇన్స్టిట్యూట్ గా వ్యవహరించనుంది. ఉత్తరాఖండ్ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ప్రతినిధి సభ్యులు ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈ ప్రాంతంలో పర్యటిస్తుంది. విద్యార్థులతో పాటు నలుగురు అధ్యాపకులు కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. ఈ పర్యటనను ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రముఖులతో సమావేశం – విభిన్న సంస్కృతులపై అవగాహన
ఈ పర్యటన ద్వారా, రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, సాంప్రదాయ, ఆలోచనా విధానాలు, ఆవిష్కరణలపై పరస్పరం అవగాహన పెంచుకోవడం, ఉత్తమమైన విధానాలను అలవరుచుకోవడంపై దృష్టి సారిస్తారు. అలాగే పర్యాటకం, సంప్రదాయం, పురోగతి, సాంకేతికత మరియు పరస్పర సంబంధాలను ప్రోత్సహించుకోవడం కూడా ఎజెండాలో భాగంగా ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో బృందం సభ్యులు కళాకారులు, గాయకులు, క్రీడాకారులతో పాటు ఉత్తరాఖండ్ గవర్నర్, ఆ రాష్ట్ర విద్యా మంత్రితో సహా ప్రముఖ నాయకులుతోపాటు సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న సంఘ సంస్కర్తలతో, స్థానిక సంఘాలతో సమావేశం అవుతారు.
చారిత్రక ప్రదేశాల సందర్శన
విద్యార్థులు టైడ్స్ ఇంక్యుబేటర్, బయోనెస్ట్ ఇంక్యుబేటర్, టింకరింగ్ ల్యాబ్, ఇన్స్టిట్యూట్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ మరియు రాక్ మ్యూజియమ్లను కూడా సందర్శిస్తారు. అలాగే నైనిటాల్, హరిద్వార్ మరియు రిషికేశ్ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నారు. తద్వారా అక్కడి గొప్ప సంస్కృతి, చరిత్ర, పౌరాణిక ఇతిహాసాలు మరియు వారసత్వాన్ని, అక్కడి వంటకాలు, ప్రజల జీవన విధానాలపై అధ్యాయనం చేసి అవగాహన పెంచుకోనున్నారు.
మే 4న ముగియనున్న పర్యటన
NIT వరంగల్‌కు చెందిన యువ సంగం సీజన్- II నోడల్ ఆఫీసర్ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ, “విద్యార్థులు భారతదేశ భవిష్యత్, ఆవిష్కర్తలు, నాయకులు. ఈ క్రమంలో వారు దేశ గొప్ప వారసత్వం, సంస్కృతి, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం, స్థానిక సంఘాలను అధ్యాయనం చేయడం, అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఇది వారి వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడటమే కాకుండా వారి ఆలోచనా విధానాలను, పరిధులను విస్తరిస్తుంది. యువ సంగం చొరవ ఆ దిశలో ఒక అడుగు. పర్యటనలో భాగంగా విద్యార్థులు ఉత్తరాఖండ్ పురాతన చరిత్రను, అక్కడి ప్రజల జీవన విధానాలను, సంస్కృతి, ఆహారం, వారసత్వం, విలువలను, చరిత్రను దగ్గరగా చూసి వాటిని అనుభూతి చెందనున్నారు. ఈ యాత్ర కొత్త ఆలోచనలకు తలుపులు తెరవడమేకాకుండా విద్యార్థుల ఆలోచనలకు, లక్ష్యాలకు ఒక రూపం ఇవ్వడంలో సహాయపడుతుందసని ఆయన ఆశించారు.
సంస్కృతిని పరిచయం చేయడమే ముఖ్య ఉద్ధేశం
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఆలోచనే యువసంఘం. యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వరా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల యువత మధ్య మరియు వారికి భారతదేశ సంస్కృతి, విలువలను పరిచయం చేయడం ముఖ్య ఉద్ధేశం. వివిధ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాల్ని బలోపేతం చేసేందుకు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా యువత అపారమైన ప్రతిభ, ప్రపంచ విజ్ఞానం, సృజనాత్మకత మరియు ఆవిష్కరణల స్ఫూర్తిని మాత్రమే కాకుండా దేశ మానవీయ తత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక విలువలను పునఃసమీక్షించే అవకాశం కల్పిస్తుంది.
ఫేజ్-1తో అద్భుతమైన ఫలితాలు
ఫిబ్రవరిలో ప్రారంభించబన యువసంగమం మొదటి దశ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఫేజ్-2ను ప్రారంభించారు. మొదటి దశలో 1200 మంది యువకులు పాల్గొని 22 రాష్ట్రాలను సందర్శించడం కార్యక్రమం విజయవంతానికి అద్దంపడుతుంది. ఇది 29 ప్రత్యేక పర్యటనల ద్వారా ఈశాన్య భారత గొప్ప సంస్కృతి, వారసత్వం మరియు వైవిధ్యాన్ని బహిర్గతం చేసేలా గత ఫిబ్రవరి- మార్చిలో సాగింది.
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యువసంగమం’
ఈశాన్య రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలకు చెందిన యువత ఇతర రాష్ట్రాల చరిత్ర, జీవనశైలి లాంటి అంశాల పై అవగాహన పెంచుకొని, అక్కడి ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా తమ ఉనికిని, పరిధులను విస్తరిచుకోవాలన్న ఉద్ధేశంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఒక చొరవే ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యువసంగమం . ఈ కార్యక్రమం యువతకు ఎక్స్పోజర్ టూర్లను నిర్వహించడంపై దృష్టి పెడుతుంది. జీవితంలోని వివిధ కోణాలు, అభివృద్ధి, లాంటి ఇతర అంశాలపై యువతకు అవగాహన – అనుభూతిని పంచుతుంది. ఈ పర్యటనలో భాగంగా యువత.. పర్యాటకం, సంప్రదాయాలు, ప్రగతి, టెక్నాలజీ, ప్రజలు-ప్రజల మధ్య అనుసంధానం వంటి ఐదు విస్తృత రంగాలపై అపారమైన అనుభవాల్ని పొందుతారు.













