జీనోమ్ సీక్వెన్సీతో వన్యప్రాణి సంరక్షణ
జీనోమ్ సీక్వెన్సీ ద్వారా వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుందని, జన్యువుల ఆధారంగా జరిపే పరిశోధనలు వన్యప్రాణుల అభివృద్ధికి దోహదపడతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆడ్వాన్స్‌మెంట్ ఇన్ వెటర్నరీ సైన్సెస్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనే అంశంపై హైదరాబాద్‌లో ఐఐసీటీ-సీసీఎంబీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో అమెరికా శాస్త్రవేత్త ఎడ్వర్డ్ సీ రామ్సే మాట్లాడుతూ సింహాలు, పులులు, రెడ్ పాండాల సంఖ్య నానాటికీ తగ్గుతున్నదని అవేదన వ్యక్తం చేశారు. వీటి సంరక్షణను సవాల్‌గా తీసుకుని వ్యాధుల నిరోధానికి అవసరమైన వ్యాక్సిన్లను రూపొందించాల్సిన అవసరమున్నదన్నారు. ఏనుగులు ఎక్కువగా కంటి వ్యాధులతోపాటు తొండానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నాయని బ్రిటన్ శాస్త్రవేత్త ఖైనీ యు మార్ తెలిపారు. వైల్డ్‌లైఫ్ ఎస్వోవోస్ ఇండియా సహవ్యవస్థాపకుడు, సీఈవో కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవప్రాణుల సంరక్షణతోపాటు వాటి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జంతు ప్రదర్శనశాలల్లోని మూగజీవాలు శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలను ఎదుర్కొంటన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.













