కాంగ్రెస్ ఆపరేషన్ ‘భాగ్యనగర్’…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గ్రేటర్ పై కన్నేసింది. ఇటీవలి ఎన్నికల్లో గ్రేటర్ లో దారుణఫలితాలు రావడంతో.. హైదరాబాద్ లో పార్టీ పటిష్టం చేసేందుకు తగిన ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా గ్రేటర్ లోని బలమైన నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. దీంతో వరుసగా ఎమ్మెల్యేలు , ప్రజాప్రతినిధులు వచ్చి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెళ్తున్నారు. బయటకు మాత్రం కర్టెసీ మీటింగని చెబుతున్నారు. అయితే వీరి వరుస సమావేశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
రెండుసార్లు రాష్ట్రాన్ని ఏలిన మాజీ సీఎం కేసీఆర్… పవర్ పాలిటిక్స్ లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఇతర పార్టీల నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి.. వాటిని బలహీనం చేయడంతో పాటు తన పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఓదశలో అయితే విపక్షపార్టీల ఉనికే ప్రశ్నార్థకమా అన్న ప్రశ్న తలెత్తింది. అయితే తర్వాతి పరిణామాల నేపథ్యంలో పరిస్థితులు మారాయి. క్రమంగా బలోపేతమైన కాంగ్రెస్… ఏకంగా అధికార పార్టీగా అవతరించింది.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గ్రేటర్ ఆదుకుంది. ఏకంగా 14 సీట్లు ఇక్కడే సాధించింది కారు పార్టీ. 2014 ముందు వరకూ కార్పొరేటర్ల వరకే పరిమితమైన గులాబీదళం.. వివిధ పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. టీడీపీని పోరులో అయితే లేకుండా చేసేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకుంది. ఇప్పుడు అదే పంథాను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అనుసరిస్తోంది. తాము చేసిన పనే ఇప్పుడు రేవంత్ సైతం అనుసరిస్తుండడంతో… కనీసం వాటిని ఖండించే స్థితిలో లేకుండా పోయింది బీఆర్ఎస్.
కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్‌పై పట్టు ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో గుర్తింపు దక్కని బలమైన నేతలను కాంగ్రెస్ ఆకర్షిస్తోంది.మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌ను కలిశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. కృష్ణారెడ్డి బాటలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు హస్తం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితోపాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం తెలుసుకుని ఆయనకు హుటాహుటిన మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరలేదు. తాజాగా మరోమారు ఆయన హస్తం నేతలతో టచ్‌లోకి వెళ్లారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. పక్షం క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. దాదాపు గంటపాటు చర్చించారు. ఈ క్రమంలో ఆదివారం ప్రకాశ్‌గౌడ్ ముఖ్యమంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైంది.













