హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు!
హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు తనను పోటీ చేయాలని తమ పార్టీ నేతలు కోరుతున్నారని తెలిపారు. ఒక వేళ హుజురాబాద్‌లో పోటీ చేసినా మళ్లీ వరంగల్‌కే వస్తానని, అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్‌లో పోటీచేస్తానని కొండా సురేఖ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు దాదాపు ఖరారైంది.
హుజురాబాద్ నియోజకవర్గంలో 2018 శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చాయి. వాటిని నిలపుకొంటే, త్రిముఖ పోటీ జరిగి రేసులో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ, టీఆర్ఎస్ రెండూ తమ అభ్యర్థులుగా బీసీలనే బరిలోకి దించుతున్న నేపథ్యంలో బీసీ వర్గానికి చేందిన కొండా సురేఖ వంటి బలమైన నేతను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ సామాజికవర్గమైన పద్మశాలీలు, ఆమె భర్త కొండా మురళి సామాజిక వర్గమైన మున్నూరుకాపులూ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలకు తోడు ఇతర బీసీ సామాజిక వర్గాల్లోని ఓట్లూ కలిసి వస్తే తామే చాంపియన్‌గా నిలవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.













