అసంతృప్తులపై కేసీఆర్ మౌనం..! దేనికి సంకేతం..?
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కేసీఆర్. దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్.. ఇప్పటికే విపక్షాల ఉనికిని తీవ్రంగా దెబ్బకొట్టారు. బీఆర్ఎస్ ను తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దారు. అధికారంలో ఉండడంతో ఇతర పార్టీల నేతలు సైతం వివిధ ప్రయోజనాలకోసం బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో నేతలందరూ టికెట్ల రేసులో ముందుకొచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం సిట్టింగులకే జైకొట్టారు. దీంతో టికెట్లు ఆశించిన పలువురు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నిరసనలకు దిగుతున్నారు. అయినా కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.
ప్రత్యేక తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. దీంతో ఆ పార్టీకి ప్రజాదరణ మెండుగా ఉంది. నాడు ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించినా.. ఆ తర్వాత ప్రభుత్వపరంగా కూడా తెలంగాణను మెరుగైన స్థానంలో నిలబెట్టింది. దీంతో ఆ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టారు ప్రజలు. ఇప్పుడు మూడోసారి కూడా రేసులో నిలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పదేళ్లుగా అధికారంలో ఉండడం, ఆర్థికంగా బలమైన స్థానంలో ఉండడం, కేడర్ పరంగా విపక్షాలకు అందనంత దూరంలో ఉండడంతో.. ఆ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇదే ఉత్సాహంలో కేసీఆర్ అందరికంటే ముందుగా 115 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు.
కేసీఆర్ ముందుగా టికెట్లు అనౌన్స్ చేయడంతో రేసులో ముందున్నారని అందరూ భావించారు. అయితే సొంతపార్టీలోనే అసంతృప్తి సెగలు భగ్గున్నాయి. చాలా చోట్ల అభ్యర్థులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగుతున్నాయి. మహబూబాబాద్, జనగాం, స్టేషన్ ఘన్ పూర్, ఉప్పల్, కోదాడ, కొత్తగూడెం, కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, వరంగల్ ఈస్ట్, నాగార్జున సాగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, పటాన్ చెరు, ఆసిఫాబాద్, అలేరు లాంటి చోట్ల బహిరంగంగానే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బీఆర్ఎస్ ను ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.
అసంతృప్తి రగులుతున్నా కేసీఆర్ మాత్రం మౌనంగా చూస్తూ వస్తున్నారు. ఎవరిపైనా చర్యలు తీసుకోవట్లేదు. ఎవరినీ పిలిపించి మాట్లాడలేదు. అసంతృప్తులను చల్లార్చేందుకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. దీని వెనుక కేసీఆర్ వ్యూహమేమైనా ఉందా అని పలువురు అనుమానిస్తున్నారు. ఇలాగే అసంతృప్తి పెల్లుబుకుతూ ఉంటే చివర్లో ఆయా అభ్యర్థులను మార్చేందుకు అవకాశం కలుగుతుందని చెప్తున్నారు. అసంతృప్తులను సాకుగా చూపించి పలు చోట్ల కేండిడేట్లను మార్చేస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు అసంతృప్తులను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. మరి చూడాలి.. చివర్లో కేసీఆర్ ఏం చేస్తారో..!













