సహజీవనమే: కరోనాపై నోరు విప్పిన కేసియార్
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్న కరోనా మహమ్మారితో మనం కూడా సహజీవనం చేయాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ స్పష్టం చేశారు. కరోనా తొలి దశలో వరుసపెట్టి ప్రెస్మీట్లతో ప్రజలకు ధైర్యాన్నిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసుల సంక్య బాగా పెరగడం మొదలుపెట్టిన తర్వాత కరోనాపై స్పందించడం దాదాపుగా మానేశారు. విపక్షాలు విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, కోర్టులు, కేంద్రం కరోనా నియంత్రణ చర్యలపై మొట్టికాయలు వేస్తున్నా… గత కొంత కాలంగా ఆయన ఈ విషయంపై మౌనాన్నే ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో చాలా రోజుల తర్వాత ఆయన కరోనా వ్యాధి నియంత్రణపై శుక్రవారం స్పందించారు. కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ వ్యాధితో కలసి జీవించడం అలవాటు చేసుకోవాల్సి ఉందన్నారాయన. ఈ విషయంలో అవగాహన లేని వారి విమర్శల్ని పట్టించుకోబబోమన్నారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలూ చేపట్టామని ఏ రకమైన అలసత్వమూ లేదన్నారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ చర్యలకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
ప్రైవేటుకు పోవద్దు…
కరోనా పాజిటివ్ రోగులు ఎవరూ అధైర్య పడనవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రులను కాదని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పని లేదని కెసియార్ ధైర్యం చెప్పారు. ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన అన్ని వసతులూ ప్రభుత్వం చాలా వేగంగా సమకూర్చుకోగలగిందన్నారు. హైదరాబాద్లోని గాంధీ, టిమ్స్ తదితర ఆసుపత్రుల్లో 3వేల పడకలుయ ఆక్సిజన్ సహా అన్ని వసతులతో సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10వేల పడకలు కేవలం కరోనా రోగుల కోసం అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్స, ఖర్చుల విషయంలో పారదర్శకత పాటించాలన్నారు. కరోనా చికిత్సకు తమ దగ్గర ఉన్న పడకలకు సంబంధించి వివరాలను వెల్లడించాలని ఆదేశించారు.













