ఇంతకీ ప్రగతి సభ సక్సెస్ అయిందా? లేదా?

రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ సక్సెస్ అయిందా అని అంటే ప్రజల్లో ఉన్న అంచనాలకు తగినట్లుగా జరగలేదని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కూడా ఈ సభను సాధారణ సభగానే మార్చేశారని అంటున్నారు. కేసీఆర్ ప్రసంగంలో ఎప్పుడూ వినబడే పొలిటికల్ పంచ్‌లు ఈ సభలో వినిపించలేదు. ప్రతి పక్షాలకు చురకలంటించి మైండ్ గేమ్‌తో ఛలోక్తులు విసరడంలో ఆరితేరిన కేసీఆర్ ఈ సభలో మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా వేడి కనిపించకుండా మాట్లాడారు. ఎందుకు ఇలా మాట్లాడారని సాధారణ టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో కూడా సందేహం కలిగింది. ప్రగతి నివేదిక అనగానే.. ఎన్నో కొత్త విషయాలు చెబుతారని భావించారు. గత నాలుగేళ్ల ఆదాయ,వ్యయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల పూర్తి వివరణ ఇస్తారని అందరుఅనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా వాటన్నీంటిని పక్క పెట్టెశాడు. కానీ ఎప్పుడు చెప్పే మాటలనే చెబుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రతిపక్షాలపై విసిరే వ్యంగ్యాస్త్రాలు కూడా ఈసారి విసరలేదు. కేసీఆర్ రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటారని రోజుల తరబడి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ విషయం చర్చించడానికే తరచూ క్యాబినెట్ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. సభకు ముందు కూడా క్యాబినెట్ సమావేశం నిర్వహించడంతో.. ప్రగతి సభలో ఖచ్చితంగా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటారని, టీఆర్‌ఎస్ నాయకులు కూడా ఎదురు చూశారు. చివరకు ఆయన ఎలాంటి రాజకీయపరమైన నిర్ణయాలు కూడా ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ నేతలు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తానికి ప్రగతి నివేదన సభ చప్పగానే సాగిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత కొద్ది రోజులుగా ఒక వైపు రాష్ట్ర ప్రజలు మరో వైపు పార్టీ నాయకులు ప్రగతి నివేదన సభపై ప్రత్యేక దృష్టి పెడుతువచ్చారు. అంచనాలతో ఈ సభకు వచ్చిన వారికి ఇది నిరాశను కలిగించేలా సభ సాగిందని చెప్పవచ్చు.
పార్టీ నాయకులు కూడా ముఖ్య మంత్రి ఇచ్చే కొత్త హామీలు, పథకాలపై దృష్టి పెట్టడంతోపాటు, ముందస్తు ఎన్నికలు వస్తాయని వస్తున్న ప్రచారంలో తమ స్థానాలకు సంబంధించి ఏమైనా ప్రకటన వస్తుందిమో అని ఆసక్తిగా ఎదురు చూశారు. కాని అటువంటివి ఏమీ లేక పోవడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. అంతే కాదు ముందుగా ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి ఉపన్యాసం సుమారు రెండు గంటలు పాటు ఉంటుందని ప్రకటించిన కేవలం 40 నిమిషాలకే ప్రసంగం ముంగించడం అటు కార్యకర్తల్లోనే ఇటు నాయకుల్లోనే ప్రత్యేక చర్చకు దారి తీసింది. సహాజదోరణికి భిన్నంగా అటు నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ సభ కాస్తా నిరుత్సాహ సభగా మారింది.
కేసీఆర్ వ్యూహం ఏమిటి?
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహంలో ఆయనకు మించిన చతురుడు లేరని అంటారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ సభలో ఆయన ఎక్కువగా ప్రసంగించలేదని అర్థమవుతోంది. దానికితోడు రాష్ట్రంలో రాహుల్ పర్యటన తరువాత కాంగ్రెస్‌కు పెరిగిన మద్దతును దృష్టిలో పెట్టుకునే ఆయన బహిరంగసభలో హస్తినకు బానిసలుగా ఉండరాదని హెచ్చరించినట్లు తెలిసింది.
తెలంగాణలో ఇతర ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, కొత్తగా వచ్చిన జనసేన వల్ల ఇబ్బంది ఏమీ ఉండదని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో ఎంఐఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల ఆ పార్టీ మిత్రపక్షంగానే ఉంటోంది. ఇక వామపక్షాలు వల్ల భయంలేదని అనుకుంటోంది. కాని కాంగ్రెస్‌తోనే ఇబ్బంది ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు. కాంగ్రెస్‌ను తెలంగాణ నుంచి దూరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన రాజకీయ వ్యూహాలను పన్నుతున్నారు. ముందుగానే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ బలం ఏమిటో తేలుతుంది. దానికితోడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు తమ వనరులను అంతా ఖర్చు చేసుకుంటారని, ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధపడరని ఆ ఎన్నికల్లో అన్నీ స్థానాలను తాము గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలాగూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి పూర్తి మెజారిటీ రాదని వార్తలు వస్తుండటంతో కేసీఆర్ అత్యధిక ఎంపి స్థానాలను గెలుచుకుని కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసమే ఆయన ముందస్తుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. దానికితోడు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటం, రైతులు పంటలు బాగా పండుతుండటం, ఇతర వర్గాలలో కూడా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత లేకపోవడం వల్ల ముందస్తుకు వెళ్ళడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. దానికితోడు సంక్షేమపథకాల వల్ల అన్నీ వర్గాల ప్రజలకు లబ్ది కలుగుతుండటంతో తన గెలుపు సునాయాసమేనని కూడా ఆయన అనుకుంటున్నారు. దానికితోడు టీడీపికి మద్దతుదారులుగా ఉన్న సెటిలర్లను కూడా ఆట్టుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఇటీవల మరణించిన టీడిపి నాయకుడు హరికృష్ణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని వ్యతిరేకించి హరికృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సెటిలర్ల సానుభూతి లభిస్తుందన్న ఉద్దేశ్యంతోనే అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.
తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే కాబట్టి జాతీయ రాజకీయాల అంశాలన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పావులు కదుపుతున్నారు. దానికితోడు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉన్న నాయకత్వ విభేదాలు, సమన్వయలోపం వంటివి ఉన్నందున ఇప్పుడు ఎన్నికలు జరిగితే తమకే విజయం ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమాగా ఉన్నారు. అందుకు అనుగుణంగానే అసెంబ్లీ రద్దుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
తరలివచ్చిన జనం…రికార్డు సృష్టించిన సభ
టీఆర్‌ఎస్ నిర్వహించే బహిరంగ సభలకు జనాలు లక్షల సంఖ్యలో రావడం గతంలో కూడా జరిగింది. కాని ఈసారి కొంగర కలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఏపీ నుంచి వివిధ మార్గాల ద్వారా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, కడప తదితర జిల్లాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు ప్లకార్డులు చేత పట్టుకొని హైదరాబాద్ చేరుకొన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన పలు రైళ్లలో అధిక శాతం మంది కొంగరకలాన్ ప్రగతి నివేదన ప్రాంగణంవైపే తరలుతున్నట్టుగా తెలిపారు. ఆంధ్ర నుంచి తెలంగాణ మీదుగా వెళ్లే శాతవాహన, కోణార్క్, గోల్కొండ, నర్సాపూర్, మచిలీపట్నం, గోదావరి, గరీబ్ రథ్, విశాఖ, గౌతమి, నారాయణాద్రి, పద్మావతి, చార్మినార్, సింహపురి ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ కిక్కిరిసిపోయి కనిపించాయి. వీరిలో అధికశాతం మంది టీఆర్‌ఎస్ సభకు తరలివెళ్లారు. తెలంగాణ నుంచి భాగ్యనగర్, కాగజ్‌నగర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక కోచ్‌లను బుక్ చేసుకుని జనం తండోపతండాలుగా వచ్చారు. పలు రైళ్ల బోగీలకు టీఆర్‌ఎస్ జెండాలు, బ్యానర్లు కట్టారు.
కొంగరకలాన్ సభ సరికొత్త రికార్డు
కొంగరకలాన్ సభ సరికొత్త రికార్డు సష్టించింది. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మహాజనప్రభంజనాన్ని సృష్టించి టీఆర్‌ఎస్ కొంగరకలాన్ వేదికగా చరిత్రను తిరగరాసింది. వరంగల్‌లో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన మహాగర్జన సభ ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద రాజకీయసభగా రికార్డుకెక్కగా.. దాదాపుగా 5 లక్షల మంది ఈ సభకు వచ్చారని సమాచారం. తొలుత 25 లక్షల మంది వస్తారని చెప్పినప్పటికి అంతగా జనం కనిపించలెదు. ఏదీ ఏమైనా ఇది కూడా రికార్ద్ గానే చెప్పవచ్చు.
ప్రగతి నివేదిక బుక్‌లెట్‌లు 40 లక్షలు
కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వచ్చినవారందరికీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేశారు. ‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం- ప్రగతి నివేదిక’ పేరుతో 40 లక్షల బుక్‌లెట్లను ముద్రించి, సభకు వచ్చిన ప్రతీ ఒక్కరికి అందించారు. ఈ నివేదికలో ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 500 కార్యక్రమాల వివరాలున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఒకే చోట చేర్చి, రూపొందించిన ఈ నివేదికను సభికులు ఆసక్తిగా పరిశీలించారు. రానున్న ఎన్నికల ప్రచారంలో ఈ బుక్‌లెట్‌లో పొందుపరిచిన అంశాలే ప్రచారాస్త్రాలుగా మారతాయని టీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు.
కేటీఆర్‌ను ముందుంచిన కేసీఆర్
టీఆర్‌ఎస్ పార్టీలో కేటీఆరే నెంబర్ 2 అన్న విషయాన్ని ఈ సమావేశం ద్వారా మరోమారు పార్టీకి, ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారు. నాలుగేళ్ళ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రగతి నివేదన సభ ద్వారా చెబుతానని ప్రకటించిన తరువాత మంత్రి కేటీఆర్‌ను కేసీఆర్ రంగంలోకి దింపారు. కొంగరకలాన్‌లో సభ నిర్వహించే స్థలాన్ని చదును చేసే సమయం నుంచి సభ ముగిసేంతవరకు కేటీఆర్ అక్కడనే ఉన్నారు. ఈ సభకోసం దాదాపు 10 రోజులుగా అక్కడే మకాం వేసి అన్ని పనులను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏమేమీ చేయాలో సూచనలు ఇవ్వడంతో పాటు వాటిని దగ్గరుండి…జరిపించారు. మైదానంలో ఎక్కడెక్కడే ఏమేమీ ఏర్పాటు చేయాలి.. వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. జనాన్ని సభకు రప్పించే అంశంలోనూ పార్టీ నేతలతో నిత్యం సంప్రదింపులు జరిపారు.
మొత్తానికి ఈ సభ ఆది నుంచి ముగిసే వరకూ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి మరీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌లో ట్రబుట్ షూటర్‌గా పేరున్న మంత్రి హరీశ్‌రావును సభ దరిదాపుల్లోకి కూడా రాకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. సభ నిర్వహణ పూర్తిగా కేటీఆర్‌కు అప్పగించడం ద్వారా.. తన వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ మరోమారు చెప్పారు.
ఏదీ ఏమైనా ఈ కొంగరకలాన్‌లో జరిగిన సభ విజయవంతమైనా కాకపోయినా, ప్రజల్లో మాత్రం తమ సత్తాను ప్రదర్శించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నించింది. సభకు వచ్చిన లక్షలాది జనాలతో పార్టీ సంతృప్తిని పడినట్లే కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీలైన కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలు ఈ సభ తుస్సుమని అంటున్నా వచ్చిన జనాలను చూసి తమ పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవాలని మాత్రం అనుకుంటున్నట్లు తెలిసింది.