మరోసారి అధికారం ఇవ్వండి : కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లుగా ప్రగతి నివేదిక సభ సాక్షిగా తెలంగాణ ప్రజలకు సాంకేతాలు ఇచ్చారు. ఆయనే స్వయంగా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చాడు. కేసీఆర్ శాసన సభ రద్దు ఎప్పుడు చేస్తడు? సభలో దాని గురించి ఏం చెబుతడు? అంటూ టీవీలు, పేపర్లు ఆసక్తి రేపాయి. నేను ఒక్కటే చెబుతున్నా, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి, ప్రజల భవిష్యత్తుకు ఏది మంచి నిర్ణయమైతే అదే తీసుకోండని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లందరూ నాకు అప్పజెప్పారు. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఆ నిర్ణయాలన్నీ తీసుకుంటాం. ఆ రోజున మీకు అన్ని విషయాలు చెబుతాను అన్నారు. ఇదే సందర్భంగా ఆయన బంగారు తెలంగాణ సాధనలో మిగిలిపోయిన కార్యక్రమాలను పూర్తి చేయడానికి మరో ఐదేళ్ల కాలానికి ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
అధికారం ఇస్తే ఎంత గొప్పగా ప్రభుత్వాలు పని చేయవచ్చో నిరూపించనని, మళ్లీ ప్రజలు దీవిస్తే అద్భుతంగా కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ, సమూలంగా పేదరికాన్ని నిర్మూలించడం, యువకులకు ఉద్యోగ అవకాశాలు విరివిగా పెంచడం వంటివి తప్పకుండా సాధించి పెడతానని హామీ ఇచ్చారు. తన మాటను విశ్వసించి, మరోమారు ఆశీర్వచనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నామని, అప్పుడే సంబంధిత కార్యాచరణ ప్రకటిస్తానని తెపారు. కొంగరకలాన్‌కు మించిన సభను భవిష్యత్తులో మరింత మంచిగా పెడతామన్నారు. ప్రభుత్వాధినేతగా ఉండి ఇప్పుడు కొత్త పథకాలు ప్రకటించడం ధర్మం కాదని అన్నారు. సీఎం చేయదలుచుకుంటే ఇప్పుడే చేయాలన్నారు చేయాల్సినవి, చేయగలిగినవన్నీ చేస్తూ పోతున్నామమని అన్నారు. ఇప్పుడు చెప్పి ఎప్పుడో చేస్తామనడం సరికాదని, ముఖ్యమంత్రి హోదాలో అలా చెప్పడం అనైతికమని వ్యాఖ్యానించారు. అందుకే , కొత్త పథకాలన్నీ ముఖ్యమంత్రి హోదాలో చెప్పకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతామని అన్నారు.













