112 సీట్లకు అభ్యర్థులు ఖరారు చేసిన కేసీఆర్..! నేడో రేపో ప్రకటన..!!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలనం సృష్టించబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. దాదాపు నాలుగు నెలల ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. అది కూడా పది, ఇరవై స్థానాలకు కాదు.. ఏకంగా 112 స్థానాలకు.! విపక్షాల అంచనాలకు ఏమాత్రం అందని విధంగా కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు. వీలైనంత ముందుగా అభ్యర్థులను ఖరారు చేయడం, ప్రజల్లోకి అభ్యర్థులను పంపడం ద్వారా గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడతాయనేది కేసీఆర్ ఆలోచన. అందుకే లిస్ట్ రెడీ చేసేశారు. ఈ రాత్రికి లేదా.. రేపు ఉదయం అభ్యర్థులను ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి చెప్తున్నట్టుగానే దాదాపు సిట్టింగులందరికీ సీట్లు దక్కబోతున్నాయి. సిట్టింగులను వదులుకోబోమని.. మరీ వ్యతిరేకత ఉన్న వాళ్లను మార్చక తప్పదని కేసీఆర్ మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు. అందులో భాగంగా కేవలం ఆరుగురు సిట్టింగులను మాత్రమే కేసీఆర్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు సిట్టింగులకు సీట్లు ఇవ్వట్లేదు. అలాగే ఉమ్మడి మెదక్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కేసీఆర్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా 119 స్థానాల్లో 112 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ఫైనల్ చేసేశారు. ఇందులో ఆరు కొత్త ముఖాలు కనిపించబోతున్నారు. ఒక జడ్పీ ఛైర్మన్ తో పాటు ఒక ఎమ్మెల్సీకి కూడా సీటు కేటాయించినట్టు సమాచారం.
మరోవైపు వామపక్షాలతో పొత్తు కొనసాగుతుండడంతో ఆ పార్టీలకు సీట్లు ఇస్తారా.. లేదా … అనే ఉత్కంఠ నెలకొంది. జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలూ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండడంతో బీఆర్ఎస్ నుంచి బయటికొస్తాయని కూడా అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా వామపక్ష పార్టీలకు కూడా కేసీఆర్ సీట్లు ఖరారు చేశారు. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున ఇవ్వాలని పట్టుబట్టాయి. హుస్నాబాద్, కొత్తగూడెం సీట్లు ఇవ్వాలని సీపీఐ కోరుతోంది. అలాగే.. పాలేరు, మిర్యాలగూడ తమకు కేటాయించాలని సీపీఎం అడుగుతోంది. అయితే సీపీఐకి మునుగోడు, సీపీఎంకు భద్రాచలం సీట్లను ఇస్తున్నట్టు కేసీఆర్ ఆయా పార్టీల కార్యదర్శులకు సమాచారం ఇచ్చారు. అలాగే రెండు పార్టీలకు రెండు ఎమ్మెల్సీ పదవులను ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో పొత్తు కొనసాగుతుందని అర్థమవుతోంది.
మొత్తంగా 119 స్థానాల్లో 112 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు కేసీఆర్. రెండు సీట్లను వామపక్షాలకు కేటాయించడంతో ఆ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అధికార పార్టీ నుంచి మొత్తం 114 స్థానాలపై అభ్యర్థులు దాదాపు కొలిక్కి వచ్చినట్లే. ఇక మిగిలింది 5 స్థానాలు మాత్రమే. వీటిని ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. కేసీఆర్ గజ్వేల్ నుంచి మారతారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆయన గజ్వేల్ నుంచే పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 112 స్థానాలను అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి పంపడం ద్వారా విపక్షాలకు కేసీఆర్ భారీ షాక్ ఇస్తున్నారు.













