ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదని తడిబట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన ప్రయత్నం కలకలం రేపుతోంది. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ గొడవతో తనకు ఏమాత్రం సంబంధం లేదని సంజయ్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై మాట్లాడుతూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల వద్ద ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్తూ.. తడిబట్టలతో ప్రమాణం చేశారు. ఈ విషయంలో తన నిజాయితీని సీఎం కేసీఆర్ కూడా నిరూపించుకోవాలని, నిజంగా ఇదంతా ఆయన చేసిన ప్లాన్ కాకపోతే కేసీఆర్ కూడా తనలా ప్రమాణం చేయాలని సవాల్ చేశారు.













