టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం వెనుక .. పెద్ద కుట్ర
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఒక స్వామి చెప్పినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫామ్ హౌస్లో కుటుంబ సమేతంగా క్షుద్ర పూజలు చేసి ద్రవాలను తీసుకెళ్లి కాళేశ్వరం కలిపారని, 3 నెలలకోసారి నల్లపిల్లితో కేసీఆర్ పూజలు చేస్తారని తీవ్రంగా ఆరోపించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్, మజ్లీస్ కలిసి ప్రజలను రాచిరంపాన పెడుతున్నారని ధ్వజమెత్తారు. మజ్లీస్ పార్టీ నేతలు చట్టాలను గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకోవాలని, అక్రమంగా దోచుకుంటే ఈడీ లాంటి సంస్థలు చూస్తూ ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని సీఎం ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు.













