ఆ పార్టీకి ఒక జెండా, ఎజెండా లేదు : బండి సంజయ్
కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెడుతున్నారో సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం సొంత పార్టీ నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా జాతీయ పార్టీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలతో జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ బండారం బయటపడుతుందనే జాతీయ పార్టీ నాటకం ఆడుతున్నారన్నారు. నాకు తెలిసిన సొంత విమానం కొన్నది ఇద్దరే. ఒకరు కేఏ పాల్ మరొకరు కేసీఆర్. భవిష్యత్‌లో వీళ్లిదరికీ అలయెన్స్ ఉంటుందేమో అని అన్నారు.
కేటీఆర్ ను సీఎంను చేయాలి. లిక్కర్ క్వీన్‌కు ఏదో విధంగా ఢల్లీిలో చేయూత ఇవ్వాలి అనేది కేసీఆర్ ఉద్దేశం అన్నారు. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి చర్చకు వస్తుందనే కొత్త పార్టీ ప్రకటన. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారు. కానీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అని పేరు మార్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లాలన్నారు. టీఆర్ఎస్ పేరుతో మునుగోడులో ఓటు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. మనది స్వయం పాలన అన్నారు.
జాతీయ పార్టీ నాయకులు టూరిస్టుల్లా వచ్చి పోతుంటారు అని విమర్శలు చేశారు. టూరిస్టు మాదిరిగా కేసీఆర్ ఇప్పుడు ఎక్కడికి వెళతారు? జాతీయ పార్టీలు ఏం చేస్తాయన్నారు. మరి కేసీఆర్ ఎందుకు జాతీయ పార్టీ పెట్టారు? మేం కట్టే పన్నులు ఎక్కువ ఆ స్ఠాయిలో కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా వచ్చే ఆదాయం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు ఇస్తారు? ఏం చేస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.













