తెలంగాణ కాంగ్రెస్లో ఇదే ఐకమత్యం కంటిన్యూ అవుతుందా..?
కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ పార్టీలో అందరూ లీడర్లే. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. ఎవరు ఎవరినైనా విమర్శించొచ్చు. ఎవరూ పట్టించుకునే వాళ్లే ఉండరు. అధిష్టానం కూడా చూసీ చూడనట్లు వెళ్తుంటుంది. ఎంత పెద్ద విమర్శలు చేసినా చర్యలు మాత్రం తీసుకోదు. చూస్తూ ఊరుకుంటుంది. పార్టీ నష్టం జరుగుతుందని తెలిసినా చూసీచూడనట్లు వెళ్తుంటుంది. కాంగ్రెస్ లో తప్ప మరే పార్టీలోనూ ఇలాంటి వాతావరణం మనం చూడలేం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రజాస్వామ్యం మరీ ఎక్కువ. ఎవరు ఎప్పుడు నోరు పడేసుకుంటూ ఉంటారో చెప్పలేం.
తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇక్కడ లీడర్లు ఒకరంటే ఒకరికి కుదరదు. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాకి ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. రేవంత్ రెడ్డి వర్గంపై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కారాలు మిరియాలూ నూరుతుంటారు. బహిరంగంగానే రేవంత్ వర్గంపై నోరు పడేసుకుంటూ ఉంటారు. అయినా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. అందరూ కలిసి ఒకే వేదిక పంచుకునే సందర్భాలు కూడా తక్కువ. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఏదైనా కార్యక్రమం చేపట్టి ఆహ్వానాలు పంపినా నేతలు డుమ్మా కొడుతుంటారు. పీసీసీనే ధిక్కరిస్తూ ఉంటారు.
కానీ ఇవాళ డి.శ్రీనివాస చేరిక సందర్భంగా నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హాజరయ్యారు. తామంతా ఒక్కటే అని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. ఇన్నాళ్లూ ఒకరిపై ఒకరు విమర్శించుకున్న నేతలంతా ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఆశ్చర్యపోయాయి. ఇలాగే కలసికట్టుగా ఉంటే ఎంత బాగుంటుందో అని కిందిస్థాయి లీడర్లు వాళ్లకు సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలముంది. కానీ నేతల్లో ఐక్యత లోపించడం వల్లే ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఒకరి కింద మరొకరు గోతులు తవ్వుకంటూ పైగి ఎదగాలనుకుంటారు. అందువల్లే నేతలు ఎదగలేక, పార్టీ బలపడక ఇబ్బందులు పడుతోంది. నేతలంతా ఏకతాటి పైకి వచ్చి పోరాడితే కచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకోగల సత్తా హస్తం పార్టికి ఉంది. అయితే ఆ పార్టీకి నేతలే పెద్ద మైనస్. మరి ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించి ఐకమత్యంగా మెలుగుతారా.. పార్టీని బతికించుకుంటారా.. అనేదే పెద్ద ప్రశ్న.













