తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గట్టిక్కించే మొనగాడెవరు?
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఈసారి త్రిముఖ పోరు ఉండనుంది. బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అయితే ఈసారి తాము ఏకంగా అధికారంలోకి రావాలనుకుంటోంది బీజేపీ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఆ స్థానం కాపాడుకోగలిగినా చాలనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. అలాంటి పార్టీ అధికారంకోసం పోటీ పడాలి కానీ తాము రేసులో ఉంటే చాలనుకునేంత దీనస్థితిలో ఉంది. ఇందుకు ఎవరు కారణం..?
కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలే పార్టీ దుస్థితికి కారణం. నేతల మధ్య అనైక్యత ఆ పార్టీని రోజురోజుకూ దిగజారుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇక్కడ నేతలెవరూ మరొకరి మాట వినరు. వాళ్లే కాంగ్రెస్ పార్టీ అధినేతల్లా ఫీలవుతుంటారు. అందుకే ఎవర్నీ ఎవరూ ఏమీ పీకలేకపోతున్నారు. వాళ్లకు స్వప్రయోజనాలు మినహా పార్టీ ప్రయోజనాలు ఏమాత్రం అవసరం లేదు. పార్టీ ఏమైపోయినా పర్లేదు.. తాము బాగుంటే చాలు. తమ మాట నెగ్గితే చాలు.. అనే యాటిట్యూడ్ తో పని చేస్తున్నారు ఇక్కడి నేతలు.
ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన యాత్ర చేస్తుండగానే మహేశ్వర్ రెడ్డి కూడా మరోవైపు యాత్ర చేస్తున్నారు. త్వరలో భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఇలా ఎవరికి వాళ్లు జనాల్లోకి వెళ్తున్నారు. పార్టీ హైకమాండ్ దగ్గర తమ పరపతి పెంచుకోవాలనే ధ్యాస తప్ప ఇక్కడ పార్టీ నష్టపోతోందని ఎవరూ గ్రహించడం లేదు. పార్టీని గట్టెక్కించాలంటే నేతలంతా కలసికట్టుగా యాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్తే కచ్చితంగా దీవిస్తారు. నేతలు కలిసున్నారనే భావనే కలిగించనప్పుడు ఇక జనం ఎందుకు ఆదరిస్తారు?
ఇక పార్టీ హైకమాండ్ కూడా నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంలో విఫలమవుతోంది. నేతలు నోరు జారినప్పుడు, పరిధి దాటి ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్లపై చర్యలు తీసుకోకుండా కిమ్మనకుండా ఉంటోంది. ఇది నేతలకు మరింత అలుసుగా మారింది. దీంతో నేతల నోటికి తాళం పడకపోగా మరింత గట్టిగా వినిపించేందుకు ఛాన్స్ ఇచ్చినట్లవుతోంది. అందుకే ఇప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్డడం కష్టం.













