ప్లాన్ ఏ, బీ, సీ, డీ..! తెలంగాణపై బీజేపీ తర్జన భర్జన..!!
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్నాటకలో ఓటమి ప్రభావాన్ని మరిచిపోయి శరవేగంగా అడుగులు వేస్తోంది బీజేపీ అధిష్టానం. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాగానే దాన్నుంచి బయటపడింది. వెంటనే తెలంగాణపై ఫోకస్ పెట్టింది. బీజేపీ నేతలతో నిత్యం సంప్రదిస్తూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించుకుని చర్చోపచర్చలు జరుపుతోంది. తెలంగాణ ప్రజల మనసులను గెలుచుకునేందుకు వివిధ రకాల కార్యక్రమాలతో ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని పోగొట్టుకుంది కర్నాటక. దీంతో తెలంగాణలో అయినా గెలిచి మళ్లీ సౌతిండియాలో పాగా వేయాలనుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాస్తోకూస్తో బీజేపీ బలంగా ఉందంటే అది తెలంగాణలోనే. అందుకే బీజేపీ హైకమాండ్ కూడా ఈ రాష్ట్రంపై ఆశలు పెట్టుకుంది. గట్టిగా ప్రయత్నిస్తో అధికారంలోకి రాగలమని భావిస్తోంది. అలా కాకపోయినా ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకోగలమని నమ్ముతోంది. అందుకోసమే ఇప్పటి నుంచి రకరకాల స్కీములతో ప్రజల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. కర్నాటక ఎన్నికల ఫలితాలు ముగియగానే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఆయన చేరికల కమిటీకి ఛైర్మన్ గా ఉన్నారు. కర్నాటకలో బీజేపీ గెలిస్తే తెలంగాణలో చేరికలు భారీగా ఉంటాయని భావించారు. అయితే అక్కడ బోల్తా పడడంతో ఇక్కడ ఏం చేయాలనేదానిపై చర్చించేందుకు ఈటలను పిలిపించి ఉంటారని సమాచారం. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతల మధ్య గ్యాప్ బాగా ఉంది. నేతల మధ్య విభేదాల వల్ల పార్టీ అనుకున్న విధంగా బలపడట్లేదు. ఈ విషయంపైనే కూడా ఈటల ఒక నివేదికను అధిష్టానం ముందు ఉంచినట్టు సమాచారం.
అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కూడా హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై బండిసంజయ్ అభిప్రాయాలను కూడా అధిష్టానం తీసుకున్నట్టు సమాచారం. అదే సమయంలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కేబినెట్లో ఉన్నారు. మరొకరికి కూడా మంత్రి పదవి ఇస్తే తెలంగాణలో సానుకూల వాతావరణం నెలకొంటుందని హైకమాండ్ భావిస్తోంది. అదే జరిగితే రేసులో బండి సంజయ్ ముందున్నారు. ఆయనకు కేబినెట్లో స్థానం దొరికితే ఈటలను ఆధ్యక్షుడిని చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే కర్నాటకలో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీపై ఉన్న ఆశలు చాలా వరకూ సన్నగిల్లాయి. ఇప్పుడు బీజేపీలో చాలా మంది నేతలు మళ్లీ పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన చాలా మంది నేతలు మళ్లీ సొంతగూటికి వెళ్లబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా సైద్ధాంతకంగా బీజేపీలో ఇమడలేమనే వాళ్లు కూడా ఎక్కువయ్యారు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ను ఓడించి బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే అనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. ఇలాంటి వాటన్నింటినీ బీజేపీ తట్టుకుని నిలబడగలుగుతుందా.. లేదా.. అనేది వేచి చూడాలి.













