ఇక బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్..! విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేయనున్న కేసీఆర్..!!
తెలంగాణలో ఎన్నికల వాతావరణం జోరందుకుంది. అన్ని పార్టీలూ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను దింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాము వీక్ గా ఉన్న చోట సత్తా కలిగిన అభ్యర్థులకోసం అన్వేషిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు నాయకుల కొరత లేదు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం ఐదారుగురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే సిట్టింగులకో మొదటి ప్రాధాన్యం ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయేత దాదాపు పాతిక మంది అభ్యర్థులను ఈసారి మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇక్కడ బలమైన క్యాండిడేట్లకోసం అన్వేషిస్తున్నారు కేసీఆర్. అందుకే ఇతర పార్టీల్లోని నేతలపై కన్నేశారు.
మరో ఐదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. బీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారంలో ఉంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. అయితే కేసీఆర్ ను గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్ ట్రై చేస్తున్నాయి. అందుకే అధికార పార్టీ నుంచి అసంతృప్త నేతలను తమ పార్టీల్లోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఆ రెండు పార్టీలు సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. ఇటీవలికాలంలో బీఆర్ఎస్ లో చేరిన నేతల కంటే ఆ పార్టీని వీడిన నేతలే ఎక్కువ. త్వరలో మరికొంత మంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇలా నేతలు వలసబాట పడితే అది పార్టీపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పైగా అధికార పార్టీలో ఇలాంటి పరిణామాలు మంచివి కావు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. సిట్టింగులను కాదని ఇతరులకు సీట్లు ఇస్తే సిట్టింగులు అలుగుతారు. వేరే పార్టీలోకి వెళ్లిపోతారు. ఇది మరింత నష్టం కలిగిస్తుంది. అలాగని అందరికీ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈసారి ముందే అభ్యర్థులను ప్రకటించేసి అసంతృప్త నేతలెవరో గుర్తించి.. వారిని దారికి తెచ్చుకోవడమో.. వేటువేయడమో చేసేందుకు కేసీఆర్ రెడీ అయిపోయారు. ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారం. పార్టీలో ఇలాంటి అలకలు, బుజ్జగింపులు ఎప్పుడూ ఉండేవే.
అయితే పార్టీ బలపడాలంటే ఉన్న నేతలను కాపాడుకోవడమే కాదు.. ఇతర పార్టీల నుంచి నేతలను లాక్కోవాలి. అప్పుడే పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. మన పార్టీ నుంచి ముగ్గురు పోతే కనీసం ఆరుగురిని ఇతర పార్టీల నుంచి తెచ్చుకోవాలి. అప్పుడే పార్టీ నిలబడినట్లు లెక్క. సరిగ్గా ఇదే అంచనా వేస్తున్నారు కేసీఆర్. తమ పార్టీ నుంచి ఈసారి ఇతర పార్టీల్లోకి వలసలు ఎక్కువగా ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నారు. అది కనిపిస్తోంది కూడా. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పార్టీని వీడుతారనే సమాచారం అందుతోంది. అందుకే వాళ్ల స్థానంలో మరింత బలమైన నేతలను ఇతర పార్టీల నుంచి రప్పించేందుకు కేసీఆర్ తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలపై కేసీఆర్ కన్నేశారు. దాదాపు పాతిక మంది నేతలు కేసీఆర్ గుర్తించినట్టు తెలుస్తోంది. వారిని త్వరలోనే తమ గూటికి తెచ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అలా చేయడం ద్వారా ఆ రెండు పార్టీలను దెబ్బకొట్టినట్లు అవుతుందనేది ఆయన ఆలోచన. మరి ఆయన ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనేది చూడాలి.













