స్పీడ్ మీదున్న కేసీఆర్.. వచ్చే నెలలోనే అభ్యర్థుల ప్రకటన!?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థుల ఎత్తుగడలను ఆరా తీస్తున్నాయి. అలాగే తమ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి.. ఎవరిని బరిలోకి దింపాలి.. ఎవరిని దింపితే ఎలా ఉంటుంది.. లాంటి అనేక అంశాలపై తర్జన భర్జన పడుతున్నాయి. ఈ విషయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాస్త ముందుంది. ఇప్పటికే పలు దఫాలుగా కేసీఆర్ సర్వేలు చేయించారు. సొంత సర్వేలతో పాటు తటస్థ సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా ఆయన మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించబోతున్నారు.
రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనుకుంటున్నారు. వాళ్లు నిద్రలేచే సమయానికే తమ పార్టీ అభ్యర్థులు ఓటర్ల ఇంటి ముందు ఉండాలనుకుంటున్నారు కేసీఆర్. అందుకే వచ్చే నెలలోనే 80 స్థానాలకు పైగా అభ్యర్థులను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన కసరత్తు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో ఎలాంటి సమస్యా లేదనుకుంటున్న 80 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తే మిగిలిన స్థానాలపై ఆ తర్వాతి నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
2014. 2018 ఎన్నికలతో పోల్చితే ఈసారి పరిస్థితులు మారాయి. గతంలో రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు నడిచేది. అయితే ఈసారి ట్రయాంగిల్ వార్ నడుస్తుందనే అంచనాలున్నాయి. అందుకే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదనుకుంటున్నారు కేసీఆర్. గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దించాలనుకుంటున్నారు. వివిధ దశల్లో నిర్వహించిన సర్వేల్లో లీడ్ లో ఉన్న వారికే సీట్లు ఇవ్వనున్నారు. మనోడు, డబ్బున్నోడు, అందరివాడు.. లాంటి లెక్కలు కాకుండా ఈసారి మాత్రం పూర్తిగా సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలని కేసీఆర్ డిసైడయ్యారు. వామపక్షాలకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి రావచ్చనే ఉద్దేశంతో కొన్ని స్థానాలను మాత్రం పక్కన పెడుతున్నారు.
దాదాపు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం వెనుక కూడా కారణం ఉంది. ముందే అభ్యర్థులను ప్రకటించేస్తే వాళ్లు ప్రజల్లో ఎక్కువ కాలం గడిపేందుకు అవకాశం కలుగుతుంది. ఏవైనా చిన్నాచితకా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోగలరు. అంతేకాక, అభ్యర్థులను ప్రకటించేశాక తలెత్తే అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు కూడా తగినంత సమయం దొరుకుతుంది. అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వాళ్ల స్పందనను బేరీజు వేసి తదనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందస్తుగా అభ్యర్థులన డిసైడ్ చేస్తున్నారు కేసీఆర్.













