తెలంగాణలో జనసేన పోటీ..! అంత సత్తా ఉందా పవన్..?
ఇప్పటివరకూ జనసేన పార్టీ ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. అక్కడ ఈసారి ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రతిన పూనారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే ఇప్పుడక్కడ బీజేపీ కలిసి ప్రయాణిస్తున్న జనసేనకు వైసీపీపై యుద్ధం చేయడానికి సంస్థాగతంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తాము పొత్తులో ఉన్న బీజేపీ.. వైసీపీతో సఖ్యతగా ఉంటోంది. దీంతో బీజేపీతో కలిసి వెళ్లాలా.. లేదా అనే అంశంపై జనసేన తర్జనభర్జన పడుతోంది. టీడీపీతో కలిసి ముందుకు వెళ్తుందనే ఊహాగానాలు వినిస్తున్నా… ఆ రెండు పార్టీల నుంచి దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇంతలోనే తెలంగాణలో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. ఇదిప్పుపు హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు జనసేన ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ రాష్ట్రంలోని 32 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమించారు. వీళ్లంతా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ పరిస్థితి, పోటీ చేసేందుకు ఉన్న అవకాశాలు.. లాంటి అనేక అంశాలని నివేదిస్తారు. ఆ నివేదిక ఆధారంగా పార్టీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న నేతలు, కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. తెలంగాణలో మొత్తం 114 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే జనసేనకు రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసేంత సత్తా లేదు. ఆ విషయం పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కావాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్న జనసేన.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి దూరంగా ఉండనుంది. ఇప్పటికే దీనిపై జనసేన శ్రేణులకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జనసేన మద్దతు తమకు అవసరం లేదని బీజేపీ బహిరంగంగానే ప్రకటించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ అధికార టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అప్పటి నుంచి తెలంగాణలో జనసేనకు, బీజేపీకి మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోంది. ఇక ముందు కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని ఇరుపార్టీల నేతలూ భావిస్తున్నారు. తెలంగాణలో జనసేనను పట్టించుకునేంత సీన్ లేదనేది బీజేపీ ఫీలింగ్. అందుకే ఆ పార్టీని ఏమాత్రం ఖాతరు చేయట్లేదు.
తెలంగాణలో జనసేన పార్టీ పోటీపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని జనసేన.. తెలంగాణలో పోటీ చేయడమేంటని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతలు అన్ని సీట్లలో పోటీపై రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ సపోర్ట్ లేకుండా అన్ని సీట్లలో పోటీ చేయాలని పవన్ కల్యాణ్ కు వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అంతేకాదు.. ఇప్పటికీ ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో సంస్థాగతంగా జనసేన పార్టీ పటిష్టంగా లేదనేది వాస్తవం. గ్రామ, మండల స్థాయిల్లో కమిటీలు లేవు. కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ పటిష్టంగా ఉంది. ఇప్పటికీ పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తర్వాత.. ఆ పార్టీలో ఇతర నేతలెవరు అంటే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టకుండా తెలంగాణలో పోటీ చేయాలనే నిర్ణయాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. మరి పవన్ కల్యాణ్ వ్యూహం ఏంటో వేచి చూడాలి.













