దేశ రెండో రాజధానిగా హైదరాబాద్.. బీజేపీ ఎన్నికల స్టంట్..??
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం తలపడుతున్నాయి. అన్ని పార్టీలూ తామే నెగ్గుతామని ధీమాగా ఉన్నాయి. అయితే ఇటీవల రేసులో బీజేపీ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు తయారైంది పరిస్థితి. రేసులో వెనుకబడినట్లు గ్రహించిన బీజేపీ తమదైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. చేతికి వస్తున్న అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్న కమలం పార్టీ నేతలు ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్నారు.
బీజేపీకి తెలంగాణలో ఇప్పటికీ సంస్థాగతంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకున్నంత పట్టు లేదు. కొన్ని చోట్ల గట్టి అభ్యర్థులు కూడా లేని పరిస్థితి. అయినా కేంద్రంలో అధికారంలో ఉండడం, ఆర్థికంగా బలంగా ఉండడం, దేన్నయినా ఢీకొట్టగల నేతలుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్స్. అయితే ఇవి మాత్రమే తమకు అధికారాన్ని చేరువ చేయలేవని ఇటీవల అర్థమవుతోంది. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణలో బీజేపీపై బాగా పడింది. ఇన్నాళ్లూ బీజేపీలో చేరేందుకు ఎంతో ఉత్సాహం చూపంచిన నేతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో కమలం పార్టీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
అందుకే పార్టీ బలోపేతంపైన మాత్రమే కాకుండా ప్రజలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏఏ అవకాశాలున్నాయో పరిశీలిస్తోంది. అలాంటి హామీల ద్వారా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. అలాంటి వాటిలో ఒకటి – హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయడం. ఇన్నాళ్లూ ఇది ఆచరణ సాధ్యం కాదని అందరూ ఇది అసలు ఎన్నికల అంశమే కాదు. కానీ దీన్ని ఇప్పుడు బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. మాజీ గవర్నర్, సీనియర్ బీజేపీ నేత విద్యాసాగర్ రావు త్వరలోనే హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కాబోతోందని సంచలన ప్రకటన చేశారు. బొల్లారం, సికింద్రాబాద్ కలిపి రెండో రాజధాని చేయాలని గతంలోనే ఓ కమిటీ సిఫారసు చేసిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికల్లో లబ్ది పొందేందుకే బీజేపీ రెండో రాజధాని అంశాన్ని తెరపైకి తెస్తోందని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనుకుంటే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారంటే ఎన్నికలే కారణమంటున్నారు. రెండో రాజధాని చేస్తే సంతోషమేనని.. అయితే అది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకూడదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. అయితే రెండో రాజధాని పేరుతో హైదరాబాద్ పై పెత్తనం చేస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్, ఎంఐఎం స్పష్టం చేశాయి. అయినా ఇదంతా జరిగేది కాదని తేల్చేశాయి. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుందనేదుకు ఇదే మంచి ఉదాహరణ అని అభిప్రాయపడుతున్నాయి.













