మునుగోడులో గద్దర్ పోటీ వెనుక ఇంత డ్రామా ఉందా..?
మునుగోడు ఉపఎన్నికపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఈ బైపోల్ లో నెగ్గేందుకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. యంత్రాంగాన్నంతటినీ మునుగోడులో మోహరింపజేశాయి. అయితే ఈ మూడు పార్టీల పోరులో తానున్నానంటూ ముందుకొచ్చారు ప్రజా యుద్ధనౌక గద్దర్. కె.ఎ.పాల్ పార్టీ ప్రజాశాంతి తరపున ఆయన మునుగోడులో బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అసలు గద్దర్ ఎందుకు కె.ఎ.పాల్ పార్టీలో చేరారు.. మునుగోడు బరిలో ఎందుకు దిగాలనుకున్నారు.. అనేవి ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు.
గద్దర్ రాజకీయాల్లోకి రావాలనుకుని ఉంటే తెలంగాణలో ఏ పార్టీ అయినా చేర్చుకునేందుకు, ఆయనకు సీటు ఇచ్చేందుకు రెడీగా ఉంటుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన బీజేపీకు కూడా దగ్గరయ్యారు. కాబట్టి తన మనసులోని మాట బయటపెట్టి ఉంటే ఏ పార్టీ అయినా ఆయన కోరికను నెరవేర్చేదే. కానీ ఆయన మాత్రం ఎవరూ ఊహించని విధంగా కె.ఎ.పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరి ఆశ్చర్యపరిచారు.
అయితే కె.ఎ.పాల్ పార్టీలో గద్దర్ చేరిక వెనుక పెద్ద తతంగమే నడిచిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కె.ఎ.పాల్ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ గా పనిచేశారు. అభ్యర్థులను నిలిపారు. కానీ ఒక్కచోట కూడా సత్తా చాటలేకపోయారు. కొన్నిస్థానాల్లో కొంతమేర ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఏపీకి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో యాక్టివ్ అయ్యారు. తెలంగాణ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు పాల్. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా హైదరాబాద్ లోని పాల్ ఇంటికి కూడా విచ్చేశారు. దీంతో పాల్ నిజంగానే బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారనే ఫీలింగ్ కలిగింది.
ఇదే సమయంలో గద్దర్ కూడా కొంతకాలంగా బీజేపీ పెద్దలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వామపక్ష భావజాలాన్ని అడుగడుగునా నింపుకున్న గద్దర్.. బీజేపీ వేదికలపై కనిపించడం, ఆధ్యాత్మిక పాటలు పాడడం ఆశ్చర్యం కలిగించింది. అయితే.. తనపై ఉన్న పాత కేసులను ఎత్తివేయించుకునేందుకే గద్దర్ బీజేపీకి దగ్గరయ్యారనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు మునుగోడులో గద్దర్ పోటీ చేయడం వెనుక కూడా బీజేపీ హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.
మునుగోడులో వామపక్షాల ప్రభావం ఎక్కువ. గద్దర్ వామపక్షవాది. ఇక్కడ గద్దర్ బరిలో నిలిస్తే కాస్తోకూస్తో వామపక్షాల ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వామపక్షాలు అధికార టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నాయి. గద్దర్ పోటీ చేస్తే టీఆర్ఎస్ కు పడే ఓట్లలో కొన్ని ఆయనకు పడొచ్చు. అప్పుడు టీఆర్ఎస్ కు కలిగే లబ్దిని అడ్డుకోవచ్చు. ఇది ఇంతోకొంతో బీజేపీకి మేలు చేస్తుంది. ఇదే ప్లాన్ తో గద్దర్ ను బీజేపీయే వెనకుండి పాల్ పార్టీలోకి పంపి.. అక్కడి నుంచి పోటీ చేయిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇది నిజమో కాదో తెలీదు. అయితే గద్దర్ ఇక్కడ ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది వేచి చూడాలి.













