ఈటలకు సీఎం కేసీఆర్ గాలమేస్తున్నారా..?
ఈటల రాజేందర్.. తెలంగాణ ఉద్యమకారుడిగా, సీఎం కేసీఆర్ ముఖ్య అనుచరుడిగా పేరొందారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో అడుగులేశారు. కేటీఆర్ రాజకీయాల్లోకి రానంతవరకూ కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరంటే ఈటల పేరే వినిపించింది. అయితే అనుకోని పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి ఈటల బయటకు రావాల్సి వచ్చింది. బీజేపీలో చేరిపోయారు. ఈటల పార్టీని వీడేటప్పుడు లైట్ తీసుకున్న కేసీఆర్ మనసు ఇప్పుడు మారినట్టుంది. ఈటల జపం చేస్తున్నట్టు అర్థమవుతోంది. అసెంబ్లీలో ఈటల పేరు పదేపదే ప్రస్తావించడం వెనుక కేసీఆర్ వ్యూహమేమైనా ఉందా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించారు ఈటల రాజేందర్. నక్సలైట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈటల.. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆ చురుకుదనమే కేసీఆర్ కు నచ్చింది.
ఈటలను అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ అవిర్భావంలో ఈటల ఆర్థికంగా కూడా ఎంతో సాయపడ్డారు. ఆర్థికంగా ఎంతో బలమైన వ్యక్తి కావడంతో ఈటల ఏమాత్రం వెనకాడకుండా పార్టీకి సేవలందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి కేబినెట్లో ఈటలకు ఆర్థిక శాఖ అప్పగించారు కేసీఆర్. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చేటప్పటికి సీన్ మారిపోయింది. ఈటల ప్రాధాన్యం తగ్గిపోయింది. వైద్య, ఆరోగ్య శాఖ దక్కింది. ఇంతకు ముందు లాగా నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్లే పరిస్థితులు లేవు. ప్రగతి భవన్ కు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నెమ్మదిగా ఈటల పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఈటలకు, కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగిపోయిందని భావించిన కేటీఆర్ ఒకానొక దశలో ఈటలన వెంటబెట్టుకుని ప్రగతి భవన్ వెళ్లారు. అయినా కేసీఆర్ కలవలేదు. దీంతో పార్టీని వీడడం మేలనుకున్నారు. ఈటల పార్టీ మారడం ఖాయమని భావించిన కేసీఆర్.. ఆయనపై భూకబ్జా ఆరోపణలు నెట్టారు. దీంతో ఈటల బయటికొచ్చారు. బీజేపీలో చేరిపోయారు. హుజూరాబాద్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ పై నెగ్గారు. ఇదంతా తెలిసిన చరిత్ర.
రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈటలను ఏమాత్రం పట్టించుకోలేదు కేసీఆర్. ఆయనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. నెంబర్ టూ గా పేరొందిన ఈటల సహజంగానే ఈ అవమానాలను భరించలేకపోయారు. అయితే కేసీఆర్ మాత్రం ఈటలను తేలిగ్గా తీసుకున్నారు. అయితే అసెంబ్లీలో ఒక్కసారిగా ఈటల జపం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఈటల పోషించిన పాత్ర అందరికీ తెలుసని.. ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన ఈటలకు బీజేపీ గురించి తెలియదనుకోవడం పొరపాటని కేసీఆర్ చెప్పుకొచ్చారు. నిన్నంతా ఈటల నామస్మరణలోనే ఉండిపోయారు కేసీఆర్. పదేపదే ప్రస్తావించారు. అసలు ఈటల పేరు పలకడానికి కూడా ఇన్నాళ్లూ ఇష్టపడని కేసీఆర్.. ఇప్పుడెందుకు ఈటలపై అంత ప్రేమ చూపిస్తున్నారనేది అర్థం కావటం లేదు. బహుశా ఈటలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడానికే ఇలా చేస్తున్నారేమో అనే సందేహం కలుగుతోంది.
అయితే కేసీఆర్ మాటలను ఈటల లైట్ తీసుకున్నారు. తనను ఇరకాటంలో పెట్టడానికే కేసీఆర్ ఇలా చేసి ఉండొచ్చన్నారు. తాను పదేపదే పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు ఈటల. ఈటల సత్తా ఏంటో కేసీఆర్ కు బాగా తెలుసు. ఈటల ఆలోచనాపరుడు.. ఆవేశపరుడు కాదు. మిగిలిన నాయకుల్లాగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. ఆర్థికంగా కూడా బలవంతుడు. బహుశా హుజూరాబాద్ లో ఈటల ఓడిపోయి ఉంటే సీన్ మరోలా ఉండేదేమో. కానీ ఇప్పుడు ఈటలపై బీజేపీ హైకమాండ్ కు సదభిప్రాయం ఉంది. ఆయన సేవలను మరింతగా వాడుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. బీజేపీపై పోరు సాగిస్తున్న కేసీయార్.. ఈటలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈటల కూడా రాష్ట్రస్థాయి బీజేపీ నాయకత్వంపై కాస్త అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ కామెంట్స్ సంచలనం కలిగిస్తున్నాయి.













