BRS మళ్లీ TRSగా మారబోతోందా..?

తెలంగాణ అంటే తప్పకుండా గుర్తొచ్చే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి – టీఆర్ఎస్. 14 ఏళ్ల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆ పార్టీ పోరాటం చేసింది. ఆ పార్టీ పోరాటం ఫలించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అందుకు కృతజ్ఞతగా టీఆర్ఎస్ కు పదేళ్లపాటు అధికారం కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. పదేళ్ల తర్వాత మాత్రం ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీకి పరిమితం చేశారు. ఆ పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి పార్టీ పేరును మార్చేయడం. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితి- బీఆర్ఎస్ గా మార్చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. అయితే ఇప్పుడు ఆ పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 2024 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి లోక్ సభలో ప్రాతినిథ్యమే లేకపోవడం ఇదే తొలిసారి. దీంతో పార్టీ ఓటమికి దారితీసిన కారణాలపై ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చాలా మంది పార్టీ పేరును మార్చకుండా ఉంటే బాగుండేదని.. తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు ఏకంగా తెలంగాణ పదమే లేకుండా పార్టీని నడపడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి కూడా పలువురు తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో చాలా మంది పార్టీ పేరు మార్చడాన్ని తప్పుబడుతున్నారు.
పార్టీ ఓడిపోవడం, గెలిచిన నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుండడంతో పార్టీని ముందుకు నడిపించడం కేసీఆర్ కు కత్తిమీద సాములా మారుతోంది. దీంతో పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ముఖ్యంగా యువరక్తాన్ని పార్టీలో నింపడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి వాళ్లను నేతలుగా చేయొచ్చనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో పార్టీపరంగా తీసుకోవాల్సిన ఇతర మార్పులు, చేర్పులపైన కూడా ఆయన దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. అందులో పార్టీ పేరు మార్పు కూడా ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
పార్టీ పేరు మార్పునకు సంకేతంగానో ఏమో ఇవాళ పటాన్ చెరులో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ కండువా బదులు టీఆర్ఎస్ కండువా వేసుకున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ కండువాలు కనుమరుగై దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. అలాంటిది ఇవాళ హరీశ్ మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించేసరికి పేరు మార్పునకు ఇది సంకేతమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మారాలంటే రాజ్యాంగబద్దమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా పేరు మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే త్వరలోనే దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుందని తెలుస్తోంది.