టికెట్ల లొల్లి..
మరో మూడునెలల్లో ఎన్నికలు రానుండడంతో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేసి రేసులో దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇంకా టికెట్ల లొల్లితోనే కాలం గడిపేస్తోంది. ముందు అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ నిబంధన పెట్టి, దాన్ని అమలు చేసింది. 119 సీట్లకు గాను 1,050 దరఖాస్తులొచ్చాయి. అయితే ఇప్పుడా దరఖాస్తులను పరిశీలించి టిక్ పెట్టాలని సభ్యులకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి థాక్రే సూచించారు.
అయితే ఇక్కడే అసలు గొడవ మొదలైంది. ఒకే కుటుంబం నుంచి టికెట్ల ప్రస్తావన రావడం… కాంగ్రెస్ లో గొడవకు కారణమైంది.సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా రేవంత్, ఉత్తమ్‌కుమార్ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నట్టు సమాచారం.ఒకే కుటుంబానికి రెండు టికెట్లపై వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగినట్టు తెలిసింది.
ఉత్తమ్, ఆయన భార్య పద్మావతి రెండు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, దీనిపై స్పష్టత ఇవ్వాలని మహేశ్‌గౌడ్ కోరారు. స్పందించిన ఉత్తమ్.. దీనిపై ఇప్పుడు చర్చ ఎందుకని, ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జోక్యం చేసుకున్న రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్తమ్.. పీసీసీ అధ్యక్షుడిగా దీనిపై అభిప్రాయం చెప్పాలని, హైకమాండ్‌కు సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. కల్పించుకున్న రేవంత్ టికెట్ల విషయంలో తనను డిక్టేట్ చేయొద్దని ఉత్తమ్‌కు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఓవైపు అధికార బీఆర్ఎస్.. అసంతృప్తుల నిరసనలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇలాంటి దశలో ఆఅవకాశాన్ని ఒడిసిపట్టుకోవాల్సిన విపక్ష కాంగ్రెస్.. ఇంటిపోరుతో సతమతమవుతోంది.ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు అన్నట్లుగా.. ఇంకా టికెట్ కేటాయింపులు జరగకముందే, గొడవలు మొదలైపోతున్నాయి. రేపు ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఖరారైతే.. అప్పుడు పరిస్థితి మరింత రణరంగంగా మారుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. మరి వీటన్నింటినీ కాంగ్రెస్ ఎలా టేకిల్ చేస్తుందో వేచి చూడాలి.













