అమిత్ షా తెలంగాణ నుంచి పోటీ చేసే ఉద్దేశ్యం లో వున్నారా ?
వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్షం లేదా విపక్షాలు బలంగా లేకపోవడంతో తప్పకుండా తమదే అధికారమనే ధీమాలో ఉంది బీజేపీ అధిష్టానం. అయితే ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి. ఉత్తర భారతంలో చూపిస్తున్నంత ప్రభావం దక్షిణ భారతదేశంలో చూపించలేకపోతున్నామనే ఆవేదన ఆ పార్టీ హైకమాండ్ లో కనిపిస్తోంది. కర్నాటకలో అధికారంలో ఉన్నా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీది నామమాత్రపు పాత్రే. అందుకే ఈసారి సౌతిండియాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. నార్త్ ఇండియాలో ఎలాగైనా మళ్లీ పట్టు సాధిస్తామని నమ్ముతున్న బీజేపీ.. సౌతిండియాపై పట్టుకోసం అడుగులు వేయబోతోంది.
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి మిగిలిన పార్టీలతో పోల్చితే బీజేపీ ఎప్పుడూ ఈ విషయంలో ముందుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగుతుంటాయి కాబట్టి అక్కడ పాగా వేయాలనుకుంటుంది కమలం పార్టీ. అయితే పూర్తిస్థాయిలో మెజారిటీ సీట్లు సాధించడం, లేకుంటే మిత్రపక్షాల్లోని అసంతృప్తులను సొమ్ము చేసుకోవడం.. లాంటి వ్యూహాలతో బీజేపీ అధికారం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ ఇలాగే అధికారంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో తిరుగులేని మెజారిటీతో అధికారం దక్కించుకున్న బీజేపీ.. మరికొన్ని రాష్ట్రాల్లో దొడ్డిదారిన పీఠాలను చేజిక్కించుకుంది.
ఉత్తర భారతదేశంలో బీజేపీ ఉంటే అధికారంలోనో.. లేకుంటే ప్రతిపక్షంలోనో ఉంది. కానీ దక్షిణ భారతదేశంలోకి వచ్చే సరికి కొన్ని రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంటే మరికొన్ని చోట్ల మూడు, నాలుగు స్థానాల్లో ఉంటుంది. దక్షిణ భారతంలో పార్టీ పర్ఫార్మెన్స్ పై బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈసారి ఎలాగైనా ఇక్కడ సత్తా చాటాలనుకుంటోంది. అందుకు తగ్టట్టు వ్యూహాలు రచిస్తోంది. డిసెంబర్ చివరివారంలో దక్షిణ భారతదేశంలో అమలు చేయాల్సిన వ్యూహంపై బీజేపీ వ్యూహకర్తలు సుదీర్ఘంగా చర్చించారు. దక్షిణాదిన పాగా వేయాలంటూ పూర్తి విభిన్నమైన పంథా అనుసరించాలని నిర్ణయించారు.
బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అనే ముద్రను తొలగించుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. ముఖ్యంగా గుజరాత్ కు చెందిన ఇద్దరు నేతలే పార్టీని నడిపిస్తున్నారనే ఫీలింగ్ ఉంది. అందుకే ఆ ముద్రను తొలగించుకునేందుకు మోదీ, అమిత్ షా ఈసారి సౌతిండియా నుంచి పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మోదీని తమిళనాడు నుంచి అమిత్ షాను తెలంగాణ నుంచి బరిలోకి దించడం ద్వారా పార్టీకి మంచి ఊపు వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే కర్నాటక నుంచి వీరిద్దిరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఏ రాష్ట్రం అనేది పక్కన పెడితే సౌతిండియా నుంచి మోదీ, అమిత్ షా… లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేయడం మాత్రం ఖాయం.













