బీసీసీఐకి షాక్ : శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత
క్రికెటర్ శ్రీశాంత్ కు కేరళ హై కోర్టు లో ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో BCCI శ్రీశాంత్ పై విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తూ సోమవారం (ఆగస్టు7) ఈ రోజు తీర్పునిచ్చింది కోర్టు. గతేడాది ఢిల్లీలోని ఓ కోర్టు కూడా స్పాట్‌ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా తేల్చింది. ఈ తీర్పు తర్వాత తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని శ్రీశాంత్ BCCI ని కోరినా.. బోర్డు తిరస్కరించింది. దీంతో అతను కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు క్లీన్చిట్ ఇచ్చినా.. బోర్డు తనను కావాలని వేధిస్తున్నదని పిటిషన్ వేశాడు. అతను నిర్దోషిగా తేలినా బోర్డు ఎలా నిషేధిస్తుంది… సహజ న్యాయాన్ని తిరస్కరించడమే అవుతుందని తీర్పు సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.
2013లో శ్రీశాంత్‌తోపాటు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. హైకోర్టు తీర్పు తర్వాత శ్రీశాంత్ ట్విట్టర్లో ఆనందం వ్యక్తంచేశాడు.
బోర్డు ఉపాధ్యక్షుడు టీసీ మాథ్యూ కోర్టు తీర్పుపై స్పందించారు. BCCI ఉన్నత న్యాయస్థానంలో తీర్పును సవాలు చేయకూడదని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు చెప్పారు. నిషేధంపై విచారణ సందర్భంగా.. గతంలో ఉన్న పాలక మండలి నిషేధం విధించిందని, ఇప్పటి పాలక మండలికి దాన్ని ఎత్తేయలేదని BCCI వాదించింది. అంతేకాదు స్కాటిష్ లీగ్‌లో ఆడటానికి శ్రీశాంత్‌కు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా బోర్డు నిరాకరించింది.













