ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సమాజ్‌వాదీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ కేంద్రాన్ని కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై రాజ్యసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. విభజనల వల్ల ఆయా రాష్ట్రాల్లో అనేక సమస్యలు నెలకొంటున్నాయని వివరించారు. పంజాబ్, హరియాణా విడిపోయినా ఇప్పటికీ నదీ జలలా విషయంలో కత్తులు దూసుకుంటున్నాయని అన్నారు. సట్లేజ్ నది నీళ్లు హరియాణాకు చేరడంలేదని తెలిపారు. కృష్ణా, గోదావరికి సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా కల్గిన ఉత్తరాఖండ్‌లో ఎలాంటి సౌకర్యాలూ లేవన్నారు. ఉత్తరాఖండ్‌లో వాహనాలు లోయలో పడే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా ఒక్కటి కూడా ట్రామ్ సెంటర్ లేదన్నారు.













