సీఎంగా కన్న కల… ప్రధాని అయ్యాక సాకారమైంది
దేశ సమగ్రతకు కృషి చేసిన పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలో ఏర్పాటు చేసిన పటేల్ భారీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్నపుడే పటేల్ విగ్రహం ఏర్పాటుపై ఆలోచన చేశానని అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కన్న కల ప్రధాని అయ్యాక సాకారమైందని తెలిపారు. దేశంలోని కోట్లాది రైతులు తమవంతు సాయం చేశారన్నారు. పటేల్‌ను స్మరించుకుంటూ దేశమంతా ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటోందని అన్నారు. పటేల్‌కు నివాళిగా దేశవ్యాప్తంగా ఐక్యతా పరుగు చేపట్టారని మోదీ పేర్కొన్నారు. భారత సమగ్రతకు పటేల్ విగ్రహం చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ విగ్రహం ద్వారా దేశ సమగ్రత, ఒక వ్యక్తి సంకల్పం, దార్శనికత ప్రపంచానికి తెలుస్తుందన్నారు. కౌటిల్యుడి వ్యూహం, శివాజీ శౌర్యప్రతాపం మిళితమైన వ్యక్తి పటేల్ అని కొనియాడారు. ఇవాళ భారత్ ఐక్యంగా ఉందంటే పటేల్ చొరవే అని తెలిపారు.













