ఆ తప్పులు మళ్ళీ పునరావృతం కానివ్వను
తమ పార్టీ నిర్వహిస్తున్న శిబిరాలు, అందులో పాల్గొంటున్న యువత గురించి జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ సమీక్షించారు. హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. శిబిరాల్లో కొనసాగుతున్న ఎంపిక ప్రక్రియ విధానం, పాల్గొన్న యువత ఇచ్చిన ప్రసంగాల వీడియోలను చూశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పాలకులు చేస్తోన్న తప్పుకి ప్రజలు ఇబ్బంది పడుతుండడం చూసి తాను చలించి పోయానని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు అందులో జరిగిన తప్పు ఒప్పులను పరిశీలించానని పవన్ తెలిపారు. అందులో జరిగిన తప్పులను మళ్ళీ పునరావృత్తం కాకుండా చూస్తున్నానన్నారు. జులై నాటికి జనసేన సైనికుల ఎంపిక ప్రక్రియ ముగుస్తుందని అన్నారు. సామాజిక స్ఫృహ ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలని, అందుకే ఇలా ఎంపికలు చేస్తున్నామని అన్నారు.













