హత్యా..? ఆత్మహత్యా?
రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలుండవు అంటుంటారు. బీహార్ లో సంకీర్ణప్రభుత్వానికి రాంరాం చెప్పేసి కమలదళంతో చెట్టాపట్టాలేసుకున్న నితీశ్ వ్యవహారాన్ని ఏ కోణంలో చూడాలన్నదే ఇప్పుడు రాజకీయ పక్షులను వేధిస్తున్న ప్రశ్న. నరేంద్రమోడీ కి దీటైన ప్రత్యర్థిగా 2019 ఎన్నికల్లో విపక్ష జాతీయ మహాకూటమికి ప్రధాని అభ్యర్థిగా తలపోసిన నితీశ్ కుమార్ శిబిరం మార్చేశారు. ఎన్డీఏ గూటికి చేరిపోయారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నిజాయతీపరుడైన, సర్వామోదయోగ్యమైన ప్రత్యర్థి తలనొప్పి మోడీకి తప్పిపోయింది. ఇంకా పుంజుకోని కాంగ్రెసు, చీలికలు పేలికలుగా ఉన్న పక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీని ప్రత్యేకించి నరేంద్రమోడీని గట్టిగా సవాల్ చేసే పరిస్థితి అడుగంటిపోయింది.
వ్యూహమో, ఉద్దేశపూర్వక ఎత్తుగడో కానీ బీజేపీ శిబిరానికి కాలం కలిసివస్తోంది. మోడీ అమిత్ షా ల రాజకీయాల ముందు ప్రత్యర్థులు పల్టీలు కొడుతున్నారు. చిత్తయిపోతున్నారు. ఏకపక్షంగా పాలన సాగుతున్నా దేశవ్యాప్తంగా మెజార్టీ ప్రజలను ఒకే వేదికపైకి తెచ్చి ప్రతిఘటించగల నాయకత్వం నానాటికీ క్షీణిస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయాల పేరిట హడావిడి చేసి యువతలో ఆశలు రేకెత్తించిన అరవింద్ కేజ్రీవాల్ హవా మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయింది. చంచల రాజకీయ నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీని ఇతర రాజకీయపార్టీలు తమ నాయకురాలిగా అంగీకరించే ప్రసక్తే లేదు. దళితుల ఆశాజ్యోతి అయిన బెహన్జీ మాయావతి దుందుడుకు స్వభావం, ముందు చూపులేని వైఖరితో తమ జాతిలోనే నమ్మకాన్ని కోల్పోయారు. బీజేపీ తర్వాత పెద్దపార్టీ అయిన కాంగ్రెసు వారసుడు రాహుల్ దేశ ప్రజల్లోనూ, ఓటర్లలోనూ ఉత్సాహాన్ని నింపలేకపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో నిన్నామొన్నటి వరకూ ఏకైక దిక్కుగా ఉన్న ర్యాలీయింగ్ పాయింటు నితీశ్ కూడా చేజారిపోయాడు. మోడీకి సమ ఉజ్జీ అంటూ రెండేళ్లుగా విపక్షాలు మోస్తున్న కాడెను పక్కనపడేసి తనదారి తాను చూసుకున్నాడు. దీంతో విపక్ష కూటమి 2019 ఎన్నికలకు ముందే మానసికంగా ఓటమి పాలైనట్లయింది.
మోడీ మత రాజకీయాలతో తీవ్రంగా విభేదించి బయటకు వచ్చిన నితీశ్ అంతలోనే మళ్లీ మోడీ చెంతన చేరడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. లాలూ ప్రసాద్ కుటుంబం అవినీతిపై అతను చేస్తున్న వాదన కూడా సహేతుకంగా లేదు. లాలూపై కేసులు కొత్తేమీ కాదు. జేడీ, ఆర్జెడీ పొత్తుకు ముందే లాలూ జైలుకు వెళ్లి వచ్చారు. మోడీపై విద్వేషంతో, అవకాశ వాదంతో కాంగ్రెసు, ఆర్జెడీలతో జట్టు కట్టిన నితీశ్, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ పై తాజా ఆరోపణల నేపథ్యంలో దూరం జరిగినట్లు చెబుతున్నారు. అన్నీ తెలిసి అంటకాగి మళ్లీ కమలానికి కన్నుగీటడం ఏ రకమైన రాజనీతి అంటూ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ విపక్షాలకు ఇది మాస్టర్ స్ట్రోక్. రాజకీయంగా కోలుకోలేని దెబ్బ. నైతికంగా నితీశ్ కు కూడా మంచి పరిణామం కాదు. స్వచ్ఛ రాజకీయాలను పాటిస్తాను పదవి ముఖ్యం కాదంటూ చెప్పుకొచ్చిన నితీశ్ బీజేపీ వైపు మొగ్గు చూపకుండా ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలిగి ఉంటే ఈ మకిలం అంటేది కాదు. తేజస్విపై వేటు వేసి మంత్రివర్గం నుంచి తొలగించి.. కేసుల్లో ఉన్న కేంద్ర మంత్రి ఉమాభారతి సంగతేమిటని ప్రధాని మోడీకి సవాల్ విసిరి ఉంటే నితీశ్ ప్రతిష్ట మరింత పెరిగి ఉండేది. కచ్చితంగా 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి రేసులో ఉండేవారు. కానీ తాను వద్దనుకున్న కమలాన్నే కౌగిలించుకున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం రాజీ పడిపోయారు. విపక్షాల ఆశలను వమ్ము చేస్తూ తనను తాను కుదించుకుని ప్రాంతీయ నాయక పాత్రకే పరిమితమై పోయారు. అందులోనూ నిత్యం రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించే మోడీ,అమిత్ షా ల ఆదేశాలకు తలవొగ్గాల్సిన మిత్రపక్ష పాత్రకు ఒదిగిపోయారు. జాతీయ నాయకుడిగా ఎదిగే ఒక అవకాశాన్ని స్వచ్ఛందంగా వదిలేసుకున్నారు. తద్వారా విపక్షాల నైతిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీశారు. బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. స్పెషల్ స్టేటస్ కూడా డిమాండ్ చేస్తున్నాం అంటూ నితీశ్ అనేక రకాలుగా తన నిర్ణయాన్ని సమర్థించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజకీయ నిర్ణయాలను ప్రజాబలం ప్రభావితం చేస్తుంది తప్ప వాగ్దానాలు కాదు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ, జగన్ పార్టీకి చేరువ అవుతున్న ఘట్టాలు గోచరిస్తున్నాయి. తెలుగుదేశం కంటే వై.సి.పి బలపడిందన్న భావన ఏర్పడితే రాజకీయ తరాజు అటువైపే మొగ్గవచ్చు. అందుకే శాశ్వత మిత్రత్వం, హామీల అమలు వంటివన్నీ రాజకీయాల్లో గడ్డిపోచల కిందే లెక్క. ఈ మాత్రం రాజనీతి తెలియనివాడు కాదు నితీశ్. గతంలో బీహార్ లో బీజేపీతో సంకీర్ణం బాగుందనే భావన ఉంటే ఉండవచ్చు. కానీ ఇది మోడీ, అమిత్ షాల బీజేపీ అన్న వాస్తవం మరువరానిది.













