YS Jagan : అసెంబ్లీకి డుమ్మా.. మండలికి హాజరు..! ఇదేం స్ట్రాటజీ జగనూ..!?
రాజకీయ పార్టీలు సందర్భానుసారం తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటాయి. పార్టీకి, ప్రజలకు ఏది మేలు చేకూరుస్తుందనుకుంటే దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాన్ రచిస్తూ ఉంటారు. అంతిమంగా పార్టీ ప్రయోజనాలనే ఆయా పార్టీల అధినేతలు చూస్తూ ఉంటారు. ఏపీలో అయితే రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేయడంలో మరింత ముందుంటాయి. ఏపీలో ప్రస్తుతం ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హూదా కూడా దక్కలేదు. దీంతో చట్టసభల్లో తమకు మాట్లాడే అవకాశం దక్కదని.. అందుకే ఏదైనా ప్రజల్లోనే తేల్చుకుంటామని చెప్పేశారు వైసీపీ అధినేత జగన్.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. ఇన్నాళ్లూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో కాలం గడుపుతూ వచ్చిన చంద్రబాబు సర్కార్ ను జగన్ విమర్శిస్తూ వచ్చారు. సూపర్ సిక్స్ హామీలకు తగ్గట్టు నిధులు కేటాయించే పరిస్థితి లేక.. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా పెట్టలేకపోతోందని ఎద్దేవా చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కావట్లేదని జగన్ చెప్పడం పలు విమర్శలకు తావిచ్చింది.
అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని.. అందుకే తాము హాజరు కావట్లేదని జగన్ చెప్పుకొచ్చారు. 10 శాతం సీట్లు రాకపోయినా.. తమకు 40 శాతం ఓట్లు వచ్చాయని.. అయినా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం సరికాదనది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ తమకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మైక్ ఇవ్వరని.. అందుకే అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో నేరుగా మీడియా ద్వారా తమ వాయిస్ వినిపిస్తామని చెప్పుకొచ్చారు. ఒకరున్నా, ఇద్దరున్న అసెంబ్లీకి వెళ్లి వాయిస్ వినిపించడం రాజకీయ పార్టీల లక్ష్యమని.. అలా కాకుండా బాయ్ కాట్ చేయడం సరికాదని కొంతమంది నిపుణులు జగన్ కు సూచిస్తున్నారు.
అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన వైసీపీ.. శాసన మండలికి మాత్రం జైకొట్టింది. ఆ పార్టీకి చెందిన సభ్యులంతా మండలికి హాజరయ్యారు. ఇక్కడ వైసీపీ తరపున ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. అలాగే మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కూడా వైసీపీకి చెందిన వ్యక్తే. ఇక్కడ తమదే రాజ్యం కాబట్టి వైసీపీ హాజరై ఉంటుందని చెప్పుకుంటున్నారు. బలం ఉంటే ఒకలాగా.. బలం లేకుంటే మరోలాగా వ్యవహరించడం వైసీపీకే చెందిందని కొందరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఎన్నో పార్టీలు ఒకటి, రెండు సీట్లతో కూడా చట్టసభల్లో పోరాడిన సందర్భాలున్నాయని గుర్తు చేస్తున్నారు. జగన్ కూడా అలాంటి పోరాటస్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.













